సీబీఐ అదనపు డెరైక్టర్‌గా అర్చనా రామసుందరం
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అదనపు డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం శుక్రవారం నియమితులయ్యారు. సీబీఐలో ఒక మహిళ ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. 1980 తమిళనాడు కేడర్‌కు చెందిన అర్చనకు సీబీఐ మాతృసంస్థ. ఆమె ఇందులో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా, జాయింట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ సంస్థలో తొలి మహిళా జాయింట్ డెరైక్టర్ కూడా ఆమే.
1996-2006 మధ్య ఆమె తెల్గీ స్టాంపుల కుంభకోణం వంటి పలు ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరిపారు. ఆమె గతంలో తమిళనాడు అదనపు డీజీపీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న అర్చనను సీబీఐ అదనపు డెరైక్టర్‌గా నియమించాలని సీబీఐ డెరైక్టర్ రంజింగ్ సిన్హా సిబ్బంది శాఖకు గట్టిగా సిఫార్సు చేశారు. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపింది.