రాష్ట్ర విభజన తీరుపై గట్టిగా గళం విప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని పార్టీ నాయకుల బృందం జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌కు విజ్ఞప్తి చేసింది. ‘
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించకుండా అడ్డగోలుగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణ కోసం తాము సాగిస్తున్న పోరాటానికి తోడ్పాటునివ్వాలని, రాష్ట్ర విభజన తీరుపై గట్టిగా గళం విప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని పార్టీ నాయకుల బృందం జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌కు విజ్ఞప్తి చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోకుండా ఆ రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 3ను ప్రయోగించటం దారుణం’’ అని తప్పుపట్టిన శరద్‌యాదవ్.. దీనిపై తమ పార్టీ తరఫున గళం వినిపిస్తామని స్పష్టంగా చెప్పారు.
ఆర్టికల్ 3 కింద తనకున్న అధికారాలను దుర్వినియోగపరుస్తూ కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజనకు సిద్ధమైందని.. అడ్డగోలు విభజనను అడ్డుకోవడానికి దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు జగన్ కృషిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో సీపీఐ, సీపీఎం, బీజేపీ అగ్రనేతలను, కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిసి మద్దతు కోరిన జగన్.. శనివారం రెండోసారి దేశ రాజధానికి వచ్చారు. జగన్ ఆధ్వర్యంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, బాలశౌరి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నల్లా సూర్యప్రకాశ్‌లతో కూడిన బృందం.. తొలుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయింది. అనంతరం ఢిల్లీలోని శరద్‌యాదవ్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమైంది.
మధ్యాహ్నం 1.30 నుంచి 2.10 గంటల వరకు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో.. రాష్ట్ర పరిస్థితి, సమైక్యాంధ్ర ఆవశ్యకత, ఆర్టికల్ 3 సవరణ తదితర అంశాలపై జగన్ బృందం ఆయనతో విస్తృతంగా చర్చించింది. కాంగ్రెస్ పార్టీ, కేంద్రం ఎంత ఏకపక్షంగా, నిరంకుశంగా రాష్ట్ర విభజన సాగిస్తున్నదీ ఆయనకు వివరించింది. మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం విభజనతో కేంద్రం, కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నాయని, ఇది ప్రజాసామ్యానికి చేటుచేస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అడ్డగోలు విభజన ఆంధ్రప్రదేశ్‌తో ఆగదని, మున్ముందు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ల పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలనూ ఇదే తరహాలో విభజించే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చింది. భేటీ అనంతరం శరద్‌యాదవ్‌తో కలిసి జగన్ మీడియాతో మాట్లాడారు.
సవరించకపోతే మున్ముందు ఏ రాష్ట్రాన్నైనా ఇలాగే విభజిస్తారు..
ఆర్టికల్ 3 సవరణ కోసం మద్దతు ప్రకటించాలని కోరగా.. అందుకు మద్దతిస్తామని శరద్‌యాదవ్ హామీ ఇచ్చారని జగన్ తెలిపారు. ‘‘ఆర్టికల్ 3 సవరణ ఆవశ్యకత గురించి శరద్‌యాదవ్‌కు వివరించాం. ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడాం.. ఇలాంటి అంశాలపై శరద్ వంటి సీనియర్ నాయకులు గళమెత్తాల్సిన, దేశ సమైక్యత కోసం నిలబడాల్సిన అవసరం ఉందంటూ ఆయనను ఒప్పించాం. అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోకుండా ఇలా ఏ రాష్ట్రాన్నయినా ఏకపక్షంగా విభజించడం దేశానికి మంచిది కాదు. ఇది ఇలాగే కొనసాగేట్టయితే, ఆర్టికల్ 3కి సవరణ చేయకపోతే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది మున్ముందు ఏ ఇతర రాష్ట్రాల్లోనైనా సరే జరగొచ్చు. ఢిల్లీలో అధికారంలో ఉన్నవాళ్లు, పార్లమెంట్‌లో 272 మంది సభ్యులు ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఏ రాష్ట్రాన్నయినా ఏకపక్షంగా చీల్చవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న విభజనను మనం అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్ ఓ నిదర్శనాన్ని కల్పిస్తుంది’’ అని జగన్ పేర్కొన్నారు.
‘సవరణ’తో విభజనకు ఓ పద్ధతి తేవాలి: ‘‘మొదటి రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్‌ఆర్‌సీ) సిఫారసుల ప్రకారం 60 ఏళ్ల కిందట భాషా ప్రయుక్త ప్రాతిపదికన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఇలా రాష్ట్రాల్ని ఇప్పటికే ఓసారి విభజించిన దృష్ట్యా.. 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏ రాష్ట్రాన్నయినా పునర్‌వ్యవస్థీకరించాలన్నా, విభజించాలన్నా దానికో పద్ధతంటూ ఉండాలి. ఆ పద్ధతిని ఆర్టికల్ 3కు సవరణ రూపంలో తేవాలి. ఏ రాష్ట్రాన్ని విభజించాలన్నా ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగానో లేక మూడింట రెండొంతుల మెజారిటీతోనో తీర్మానం చేయటాన్ని తప్పనిసరి చేయాలి. అసెంబ్లీ, పార్లమెంటు రెండింటిలోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ముందుగా తీర్మానం చేసినపుడే ఒక రాష్ట్రాన్ని విభజించేలా సవరణ తీసుకురావాలి. ఈ మేరకు ఆర్టికల్ 3లో సవరణను తీసుకురావాలని మేం గట్టిగా కోరుతున్నాం’’ అని జగన్ వివరించారు.