
నేడు సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. తన కుటుంబ సభ్యులు సహా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికీ కూడా ప్రత్యేకంగా పాస్లు జారీ చేసేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. వాళ్లు కూడా సామాన్య ప్రజలతో పాటే సభలో కూర్చోవాలన్నారు. అలాగే ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని, ఎవరూ పాస్ల కోసం ప్రయత్నించాల్సిన అసవరం లేదని కేజ్రీవాల్ చెప్పారు.
కాగా, కేజ్రీవాల్ కేబినెట్లో ఆరుగురు మంత్రులు కూడా శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు. వారిలో మనీశ్ సిసోడియా, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, గిరిషీ సోని, సత్యేంద్ర కుమార్ జైన్ ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదని ఆగ్రహంతో ఉన్న వినోద్ కుమార్ బిన్నీని నాయకులు సమాధాన పరచడంతో అసంతృప్తి చల్లారినట్లయింది.