కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్
సీమాంధ్రకు 15 ఏళ్లు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అశోక్గజపతి రాజు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం చేసిన హమీలనే కొనసాగించామన్నారు. ముంపు మండలాలన్నీ గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయని అశోక్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వమే పోలవరం ముంపు మండలన్ని సీమాంధ్రలో కలుపుతామని హామీ ఇచ్చిందని చెప్పారు.
కొని కారణాల వల్ల పోలవరం ఆర్డినెన్స్పై రాష్ట్రపతి సంతకం చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కొంత వరకు సమన్యాయం జరిగినట్లే అని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. పౌర విమానయానం విభాగం మౌలిక సదుపాయాల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు. విమానయాన రంగంలో ఏమైన వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. అలాగే పూర్తి పారదర్శకతతో పని చేస్తామని అశోక్ భరోసా ఇచ్చారు.
1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే 2004లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.వీరభద్రస్వామి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. మొదటిసారిగా లోక్సభలో అడుగు పెడుతున్న అశోక్ గజపతి రాజుకు మోడీ కేబినెట్లో పౌర విమానాయ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం అశోక్గజపతి రాజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.