ఆడి రికార్డు అమ్మకాలు
బెర్లిన్: జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ ఆడి 2016 లో దూసుకుపోయింది. గత సంవత్సరం డీజిల్ ఉద్గారాలు కుంభకోణంలో అభియోగాలు, ప్రత్యర్థుల గట్టి పోటీ ఉన్నప్పటికీ, విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఫోక్స్ వ్యాగన్ గ్రూపు లగ్జరీకార్లు, స్పోర్ట్స్ యుటిలీటీ వాహనాల అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది.
2015 నాటి 1.80 మిలియన్ల వాహనాల విక్రయాలతో పోలిస్తే 2016, డిసెంబర్ అమ్మకాల్లో 1.87 మిలియన్ యూనిట్లను సాధించినట్టు కంపెనీ ప్రతినిధి శనివారం వెల్లడించినట్టు నివేదికలు చెబుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లో నెం. 2గా ఉన్న ఆడి బ్రిటన్ లో 6.4 శాతం, యునైటెడ్ స్టేట్స్ లో 4 శాతం, ఎక్కువ అమ్మకాలు సాధించింది. అయితే కంపెనీ అధికారిక లెక్కల్ని సోమవారం (జనవరి 9) ప్రకటించనుంది.
అయితే ఎమిషన్స్ స్కాంతో గ్లోబల్ లగ్జరీ కార్ల బ్రాండ్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయినా అమ్మకాల్లో హవా కొనసాగించింది.ప్రదాన పత్యర్థులు మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూలతో పోలిస్తే ర్యాకింగ్స్ లో రెండు స్థానాలు వెనుకబడిందని నిపుణుల అంచనా. మరోవైపు ఉద్గారాల కుంభకోణంపై ఇంకా ఎలాంటి తీర్పు వెలువడకపోయినప్పటికీ.... లగ్జరీ కార్ మేకర్ ఆడి అమెరికాలో డీజిల్ కార్ల అమ్మకాలను మళ్లీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.