‘బాబ్లీ’కి తాళం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహారాష్ర్ట జలదోపిడీకి శ్రీకారం చుట్టింది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేకుండా వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను దింపివేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సోమవారం అర్ధరాత్రే ప్రాజెక్టు 14 గేట్లలో 12 గేట్లను మూసివేసిన అధికారులు మంగళవారం మధ్యాహ్నం మిగిలిన రెండు గేట్లను దించివేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫృథ్వీరాజ్ చౌహాన్, ఉప ముఖ్యమత్రి అజీత్ పవార్‌ల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించి, విజయోత్సవం జరుపుకున్నారు. బాబ్లీ ప్రాజెక్టులాగే అంతరాష్ట్ర లెండి ప్రాజెక్టును పూర్తిగా దక్కించుకుంటామన్న కుట్రను బహిర్గతం చేశారు.
మహారాష్ర్టలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని ఇక్కడి రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఆలస్యంగా మేల్కొన్న మన ప్రభుత్వం న్యాయపోరాటం చేసినా.. చివరికి మహారాష్ట్రకే విజయం వరించింది. దీని వెనుక మన సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందనే ఆరోపణలున్నాయి. అయితే బాబ్లీపై సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పు మేరకు ఏటా అక్టోబర్ 28 నుంచి జూన్ 30 వరకు బాబ్లీ గేట్లను మూసేసే అధికారం మహారాష్ట్రకు ఇచ్చారు. దీంతో సోమవారం అర్ధరాత్రి కొన్ని గేట్లను, మంగళవారం మధ్యాహ్నం మిగిలిన గేట్లను దించి వేశారు.
ఎస్సారెస్పీ ఆయకట్టు ఏడారే: బాబ్లీ గేట్ల మూసివేతతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని 18.82 లక్షల ఎకరాల పంటసాగు ఏడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సుమారు ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఒకటవ దశలో 9.68 లక్షల ఎకరాలు, రెండవ దశలో 4.40 ఎకరాలు, ఇందిరమ్మ వరద కాలువ కింద 2.20 లక్షల ఎకరాలు, సదర్‌మంట్ ఆనకట్ట కింద 12 వేలు, కడెం ప్రాజెక్టు కింద 68వేలు, అలీసాగర్ ఎత్తిపోతల కింద 57 వేలు, గుత్ప ఎత్తిపోతల కింద 38 వేలు, హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల కింద 11 వేల ఎకరాలు, అలాగే నిజామాబాద్‌లోని 14 ఎత్తిపోతల కింద 34 వేల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ఎత్తిపోతల కింద 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, బాబ్లీ గేట్లను దింపడంతో వీటి భవితవ్వం ఆగమ్యగోచరంగా మారనుంది. వర్షాకాలంలో వరదలతో ఎస్సారెస్సీ జలాశయం నిండిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. 1984 నుంచి 2005 వరకు 21 ఏళ్లలో రెండేళ్లు మినహా మిగిలిన 19 ఏళ్లలో నవంబర్ నుంచి జూన్ నెలలో వచ్చిన నీటితోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండింది. బాబ్లీ బారేజీ నిర్మాణాన్ని ప్రారంభించిన 2005 నుంచి 2012 వరకు ఆరేళ్లలో చుక్కనీరు కూడా ఈ ప్రాంతం నుంచి శ్రీరాంసాగర్‌లోకి రాలేదు. బాబ్లీ గేట్ల మూసివేతతో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి.
లెండిపై కన్ను : మహారాష్ట్ర సరిహద్దులోని నిజామాబాద్ జిల్లాలో రెండు రాష్ట్రాలు సమష్టిగా చేపట్టిన లెండి ప్రాజెక్టును బాబ్లీలాగానే పూర్తిగా దక్కించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విధితమవుతోంది. దీనిపై కేంద్ర జలసంఘంతో చర్చలు జరుపుతున్నామని మహారాష్ట్ర నేతలు మంగళవారం ప్రముఖంగా పేర్కొనడం చూస్తే వారి దోపిడీ ఇంతటితో ఆగదనే విషయం స్పష్టమవుతోంది. అదే జరిగితే నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ పరిధి రెండు మండలాల పరిధిలోని 22,700 ఎకరాల ఆయకట్టుకు లెండి ప్రాజెక్టు నీరు అందని పరిస్థితి. అదే విధంగా మహారాష్ట్ర- ఆంధ్రరాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీర నదిపై లెండి ప్రాజెక్టు ఎగువ భాగంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు కేంద్ర జలవనరుల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని మహారాష్ట్ర సీఎం పేర్కొనడంతో మనకు నీటి సమస్య తలెత్తక తప్పదని తెలుస్తుంది.