పీవీఆర్‌కు బాహుబలి-2 కిక్.. సీఈవో ఏమన్నారు?
ముంబై: భారతీయ సినిమాలో బ్లాక్ బస్టర్ మూవీగా చరిత్ర సృష్టించనున్నబాహుబలి -2 స్టాక్ మార్కెట్లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ నిర్వాహక సంస్థలు పీవీఆర్, ముక్తా ఆర్ట్స్ కౌంటర్లకు బాహుబలి విజయం మాంచి కిక్ ఇచ్చింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ షేర్లు కళకళలాడుతున్నాయి.
ప్రధానంగా ముక్తా ఏ2 సినిమాస్ పేరుతో ముక్తా ఆర్ట్స్ మల్లీప్లెక్స్‌లను నిర్వహిస్తున్న ముక్తా ఆర్ట్స్ ఏకంగా 6.3 శాతం ఎగిసింది. మరో మల్టీప్లెక్స్ దిగ్గజ సంస్థ పీవీఆర్ షేరు 1.7 శాతం జంప్ చేసింది. సినిమా టికెట్లు, ఆహారం, పానీయాలు(ఫుడ్ అండ్ బెవరేజెస్) విక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుందన్న అంచనాలు ఈ కౌంటర్లలో జోష్ పెంచినట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా భారీసంఖ్యలో 9వేల స్క్రీన్లలో రిలీజ్ అయిన బాహుబలి-2 రికార్డులు సృష్టించడం ఖాయమని పీవీఆర్ పిక్చర్స్ సీఈవో కమల్ జ్ఞాన్‌చందానీ అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా దర్శకుడు రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయినీ, ఇంతకముందెన్నడూ చూడలేదని, నమ్మశక్యం కానంత అమోఘంగా ఉన్నాయని కొనియాడారు. బాహుమలి-2కి అనూహ్యమైన స్పందన వస్తోందని.. కలెక్షన్లు ఇప్పుడే అంచనావేయడం కష్టమని కమల్ తెలిపారు. అమెరికాలో దాదాపు 30 లక్షల ముందస్తు టికెట్లు అమ్ముడుబోయినట్టు చెప్పారు. దంగల్‌ను మించి రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అటు బాహుబలి ట్విట్టర్ పేజీ ఇప్పటికే 2,లక్షల 45 వేలకు పైగా ఫాలోవర్లను దాటేసింది.