మోహన్‌జీ! మీరే పదిమంది పిల్లల్ని కనండి!
న్యూఢిల్లీ: హిందూ జనాభా విషయంలో ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తున్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ వింత సవాల్ విసిరారు. 'హిందువులను రెచ్చగొట్టే ముందు, మోహన్ భగవత్‌గారే స్వయంగా పదిమంది పిల్లల్ని కని, వారిని బాగా పెంచాలి' అని ఆయన సోమవారం ట్విట్టర్‌లో సూచించారు.
మిగతా మతాలతో పోల్చుకుంటే హిందూ జనాభా తగ్గిపోతున్నదని, కాబట్టి హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆరెస్సెస్ ప్రోత్సహిస్తున్నది. గతవారం ఆగ్రాలో జరిగిన ఓ సమావేశంలో ఆహూతులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ 'హిందువులు తమ జనాభా పెంచుకోకూడదని ఏ చట్టం చెబుతున్నది? అలాంటి చట్టమేది లేదు. అలాంటప్పుడు జనాభా పెరుగుదలకు అడ్డేమున్నది? ఇది వ్యవస్థకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే సామాజిక వాతావరణమే ఇలా ఉంది' అంటూ భగవత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల ఉపాధ్యాయులతో ఆరెస్సెస్ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. హిందూ జనాభా తగ్గుదల అంశంపై మాట్లాడాల్సిందిగా ఆహూతులు కోరడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని తాజాగా కేజ్రీవాల్ తప్పుబట్టారు.