భారతీ వాల్‌మార్ట్ ఉచిత శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించిన భారతీ వాల్‌మార్ట్ యువతకి ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా రిటైల్, బ్యాంకింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. రాష్ట్రంలో ఈ ఉచిత శిక్షణను తొమ్మిది నెలల క్రితం ప్రారంభించగా, ఇప్పటి వరకు 1,000 మంది వరకు శిక్షణ తీసుకున్నట్లు భారతీ వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఎఫైర్స్) ఆర్తి సింగ్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్న వారిలో 293 మందికి వివిధ రిటైల్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించామని, మిగిలినవారికి కూడా త్వరలోనే అవకాశాలను కల్పించనున్నట్లు సింగ్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వెయ్యి మందిలో 33 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆరు శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా 25,000 మంది శిక్షణ తీసుకోగా అందులో 9,000 మందికి భారతీ వాల్‌మార్ట్ గ్రూపులో అవకాశాలను కల్పించినట్లు తెలిపారు.