టెలికాం ఇండస్ట్రీలో మరో భారీ విలీనం
టెలికాం ఇండస్ట్రీలో మరో భారీ విలీనం
Published Mon, Jan 30 2017 3:57 PM | Last Updated on Fri, Aug 17 2018 6:18 PM
న్యూఢిల్లీ : టెలికాం ఇండస్ట్రీ మొత్తం తమ చెప్పుచేతల్లో నడవాలని భావిస్తున్న టెలికాం దిగ్గజం ఎయిర్టెల్కు, కొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ అయిన జియోకు పెద్ద ముప్పు ఎదురుకాబోతుంది. మరో రెండు దేశీయ టెలికాం దిగ్గజాలు ఐడియా, వొడాఫోన్లు ఒకటి కాబోతున్నాయి. వొడాఫోన్ను ఐడియాలో విలీనం చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్తో చర్చలు సాగుతున్నాయని బ్రిటిష్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రెండు కంపెనీలు చేతులు కలుపబోతున్నాయని మార్కెట్లోనూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను ధృవీకరిస్తూ వొడాఫోన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసేసింది. దీంతో రెండు కంపెనీల మధ్యే ఉంటుందన్న పోటీ త్రిముఖంగా మారింది. ఇన్నిరోజులు నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎయిర్టెల్తో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియో పోటీపడుతోంది. ఎయిర్టెల్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇటీవల విడుదైన ఫలితాల్లోనూ ఎయిర్టెల్ లాభాలకు జియో ఏ మేర గండికొడుకుతుందో అర్థమైంది. ప్రస్తుతం ఐడియాలో వొడాఫోన్ విలీనమైతే నెంబర్ వన్ స్థానం కోసం మూడు దిగ్గజాలు పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రిటీష్కు చెందిన దిగ్గజం వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఐడియాలు భారత మార్కెట్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. లాభాలను సమంగా పంచుకోనేలా డీల్ కుదుర్చుకోవాలని భావిస్తున్న ఈ రెండు కంపెనీలు.. దీనివల్ల మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. వొడాఫోన్‌కు ఐడియా కొత్తగా షేర్లు జారీ చేస్తేనే ఈ విలీనం జరుగుతుందని స్పష్టంచేసింది. అయితే కచ్చితంగా ఈ విలీనం ఎప్పుడు ఉంటుందన్న విషయం మాత్రం వెల్లడించలేదు.
ఈ విలీనంతో రెండు కంపెనీల సంస్థ సబ్స్క్రైబర్ సంఖ్య 39 కోట్లకు ఎగబాకనుంది. ఇది ఎయిర్టెల్కున్న 27 కోట్ల కంటే ఎక్కువ. జియోకు ప్రస్తుతం 7.2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. అయితే ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు ఉన్న 42 శాతం వాటాతో ఈ విలీనానికి ఎలాంటి సంబంధం ఉండదు. విలీన చర్చలను వొడాఫోన్ ధృవీకరించడంతో ఐడియా సెల్యులార్ 26 శాతం ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ ఇతర టెలికాం స్టాక్స్లోనూ నెలకొంది. భారతీ ఎయిర్టెల్ 8 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 12.5 శాతం పెరిగాయి.
Advertisement
Advertisement