తన కాన్వాయ్‌పై దాడికి బీజేపీనే కారణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
ఇండోర్/భోపాల్: తన కాన్వాయ్‌పై దాడికి బీజేపీనే కారణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని కుక్షిలో శుక్రవారం రాత్రి దిగ్విజయ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొంతమంది దుండగులు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోగా, కారులో ఉన్న దిగ్విజయ్, రాష్ట్ర సీఎల్పీ నాయకుడు అజయ్ సింగ్ ఎలాంటి గాయాలుకాకుండా తప్పించుకున్నారు.
తమ సభలకు పెద్దసంఖ్యలో జనం రావడాన్ని చూసి సహించలేకనే బీజేపీ కుట్రపన్ని దాడిచేయించిందని దిగ్విజయ్ మండిపడ్డారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున తమకు మద్దతు పెరిగిపోతోందనే నిస్పృహతోనే దాడికి కుట్రపన్నిందన్నారు. దాడికి పాల్పడినవారు బీజేపీ జిందాబాద్ లాంటి నినాదాలను చేశారని దిగ్విజయ్ చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనకు ఫోన్‌చేసి విచారం వ్యక్తంచేశారన్నారు. అయితే ఈ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టంచేసింది.