కోడ్ ఉల్లంఘించిన రాహుల్?
కోడ్ ఉల్లంఘించిన రాహుల్?
Published Sat, Jan 14 2017 3:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో బీజేపీ- కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. నిన్న కాక మొన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ను ఎన్నికల కమిషన్ తీవ్రంగా మందలించగా, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కోడ్‌ను ఉల్లంఘించినట్లు కనపడుతోంది. ఆయన మోడల్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. హస్తాన్ని ఇక మీదట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుగా ఉండకుండా చూడాలని, దాంతోపాటు జాతీయ పార్టీ గుర్తింపును కూడా రద్దుచేయాలని బీజేపీ కోరింది.
జనవేదనా సమ్మేళన్ పేరుతో ఢిల్లీలో ఒక సభ నిర్వహించిన రాహుల్ గాంధీ.. అక్కడ మతపరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. శివుడు, గురునానక్, బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, మహ్మద్ ప్రవక్త అందరూ కాంగ్రెస్ గుర్తు అయిన హస్తాన్నే చూపిస్తారంటూ తమ ఎన్నికల గుర్తు గురించి మతపరమైన ప్రచారం చేసుకున్నారని తెలిపింది. ఫిర్యాదుతో పాటు.. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన సీడీని కూడా జతచేసింది.
కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ వ్యాఖ్యలు వ్యక్తిగతం అని ఏమీ చెప్పలేదని, అందువల్ల ఆ పార్టీ కూడా తప్పు చేసినట్లే అవుతుంది కాబట్టి పార్టీకి సైతం కోడ్ ఉల్లంఘన వర్తిస్తుందని ఆ ఫిర్యాదులో బీజేపీ తెలిపింది. ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఉత్తర్వులలోని 16ఎ, 18 పేరాలను ఉల్లంఘించినందున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తును రద్దుచేయాలని బీజేపీ నేతలు కోరారు.
Advertisement