
మోడీ కుర్చీకి భలే డిమాండు!
ఒక కుర్చీ విలువ ఎంత ఉంటుంది.. మహా అయితే వెయ్యి రూపాయలో, ఇంకా అయితే పదివేలో అంతేకదా. కానీ, ఆగ్రాలో మాత్రం ఒక కుర్చీని దక్కించుకోడానికి కొంతమంది పోటీలు పడి దాని విలువను ఏకంగా లక్షా పాతిక వేల రూపాయలు చేసేశారు!! అవును, అది అలాంటి ఇలాంటి కుర్చీ కాదు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూర్చున్న కుర్చీ మరి. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో మోడీ దానిమీద కూర్చున్నారట. అందుకే ఆ కుర్చీని దక్కించుకోడానికి బీజేపీ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ ఇప్పటివరకు రూ. 1.25 లక్షల బిడ్ వేశారు. ఈ పోటీలో ఇంకా చాలామంది ఉన్నారండోయ్. మరో ఎమ్మెల్యే యోగేంద్ర ఉపాధ్యాయ, ఆగ్రా ఎంపీ రాంశంకర్ కతేరియా లక్ష రూపాయల చొప్పున బిడ్లు వేశారు. అయితే.. ఆరోజు ర్యాలీకి ఫర్నిచర్ అందించిన కాంట్రాక్టరు, బీజేపీ కార్పొరేటర్ అయిన ప్రమోద్ ఉపాధ్యాయ మాత్రం, అసలు ఆ కుర్చీని ఎవరికీ ఇచ్చేది లేదని పట్టుపడుతున్నారట.
ఆరోజు కార్యక్రమంలో ఉపయోగించిన కుర్చీల్లో కొన్నింటిని తనకు అమ్మాలని పార్టీ కార్యకర్త ఒకరు సదరు కాంట్రాక్టరును అడగడంతో మోడీ కుర్చీ కోసం పోటీ మొదలైంది. కానీ కాంట్రాక్టర్ ప్రమోద్ నిరాకరించడంతో గుజరాత్ సీఎం కూర్చున్న కుర్చీకి రెండు వేల రూపాయలు ఇస్తానని ఆ కార్యకర్త అప్పటికప్పుడు ఆఫర్ చేశాడు. ఆ పోటీ కాస్తా అలా పెరుగుతూ పోయి ఏకంగా లక్షల వరకు వెళ్లింది! మోడీయా మజాకా మరి!!