
వీరభద్ర అవినీతిపై దర్యాప్తు జరిపించాలి
ప్రైవేటు విద్యుత్ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నారు
ప్రధానికి బీజేపీ నేత అరుణ్ జైట్లీ లేఖ
ఇది సోనియా, రాహుల్‌లకు ‘అగ్నిపరీక్ష’ అని వ్యాఖ్య
న్యూఢిల్లీ/సిమ్లా: ఒక ప్రైవేటు విద్యుత్ సంస్థ నుంచి ముడుపులు స్వీకరించిన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘ఆదర్శ్’ వ్యవహారంలో ఆగ్రహావేశాలు ప్రదర్శించిన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఈ వ్యవహారం ‘అగ్నిపరీక్ష’లాంటిదని వ్యాఖ్యానించింది. బీజేపీ నేత అరుణ్ జైట్లీ సోమవారం ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు. అవినీతికి పాల్పడిన వీరభద్రపై ప్రధాని, సోనియా, రాహుల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాజెక్టు గడువు పొడిగింపు కోసం ఒక ప్రైవేటు విద్యుత్ సంస్థకు అనుమతి మంజూరు చేసేందుకు ఆ సంస్థ నుంచి వీరభద్ర సింగ్ ముడుపులు తీసుకున్నట్లు బీజేపీ ఆరోపించింది.
అయితే, వీరభద్ర సింగ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తనపై బురద చల్లేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రధాని ఆదేశాలపై ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా వీరభద్రపై బీజేపీ ఆరోపణలను కొట్టి పారేసింది. ఏవైనా సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే కోర్టులకు లేదా తగిన దర్యాప్తు సంస్థల వద్దకు వెళ్లాలని సూచించింది. అయితే, ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరభద్ర సింగ్ అవినీతిపై అరుణ్ జైట్లీ పలు ఆరోపణలు గుప్పించారు. వీరభద్ర అవినీతిపై జైట్లీ బయటపెట్టిన వివరాలిలా ఉన్నాయి...
హిమాచల్ సర్కారు సాయికోఠీ హైడల్ ప్రాజెక్టును వెంచర్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 2002 జూన్ 14న కేటాయించింది. ప్రాజెక్టును గడువులోగా అమలు చేయడంలో కంపెనీ విఫలమైంది. గడువు పొడిగించాలంటూ కోరడంతో హిమాచల్ ప్రభుత్వం అందుకు అనుమతించింది. అయితే, కంపెనీతో ఒప్పందాన్ని రద్దుచేసుకోవాలని 2004 సెప్టెంబర్ 20న హిమాచల్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్టును హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ మండలి ద్వారా అమలు చేయించాలని నిర్ణయించింది. అంతలోనే మళ్లీ ఆ నిర్ణయాన్ని పునస్సమీక్షించి, ప్రాజెక్టు అమలును కంపెనీకే అప్పగించాలని నిర్ణయించింది. వీరభద్రసింగ్ 2013 సెప్టెంబర్ 9న మళ్లీ హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆయన నేతృత్వంలోని కేబినెట్, ప్రాజెక్టు అమలు కోసం సంబంధిత కంపెనీకి మరో పది నెలల గడువు పొడిగించింది. ఫలితంగా ఆ కంపెనీ నుంచి వీరభద్ర, ఆయన కుటుంబ సభ్యులు ఇతోధికంగా లబ్ధి పొందారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వీరభద్ర సింగ్ 2012 అక్టోబర్ 17న రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో సంబంధిత కంపెనీ పేరునైనా ప్రస్తావించలేదు. అయితే, ఆయన ఖాళీ చేసిన మండీ లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన భార్య ప్రతిభా సింగ్ 2013 మే 30న రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసిన అఫిడవిట్‌లో సంబంధిత విద్యుత్ సంస్థ ప్రమోటర్ వాకముళ్ల చంద్రశేఖర్ నుంచి తాను రూ.1.50 కోట్లు, తన భర్త వీరభద్ర రూ.2.40 కోట్లు పూచీకత్తులేని రుణాలు పొందినట్లు వెల్లడించారు.
మరోవైపు, 10 నెలల గడువు పొడిగింపు కోసం సంబంధిత కంపెనీ ప్రభుత్వానికి రూ.58.19 లక్షలు చెల్లించాల్సి ఉన్నా, ఆ మొత్తా న్ని ఇంకా చెల్లించలేదు. కాగా, వాకముళ్ల చంద్రశేఖర్‌కు చెంది న తరిణి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే మరో కంపెనీలో వీరభద్ర భార్య ప్రతిభా సింగ్‌కు 3.40 లక్షల ఈక్విటీ వాటాలు, ఆయన కుమారుడు విక్రమాదిత్య సింగ్‌కు 3.40 లక్షల ఈక్విటీ వాటాలు, కుమార్తె అపరాజితా కుమారికి 3.40 లక్షల వాటాలు ఉన్నట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సమర్పించిన వివరాల్లో వెల్లడించారు. విద్యుత్ కంపెనీకి వీరభద్ర లబ్ధి చేకూర్చినందునే ఆ కంపెనీ ప్రమోటర్ ఇవన్నీ కట్టబెట్టారని జైట్లీ ఆరోపించారు. విద్యుత్ కంపెనీకి, వీరభద్ర సింగ్‌కు నడుమ ‘క్విడ్ ప్రో కో’కు (పరస్పర లబ్ధి) ఈ వివరాలే ప్రబల సాక్ష్యాలని పేర్కొన్నారు.
ఎవరీ చంద్రశేఖర్?
వాకమళ్ల చంద్రశేఖర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే అయినా, ఈయన వ్యాపారాలు పూర్తిగా ఢిల్లీలోనే కేంద్రీకృతమయ్యాయి. చెన్నై వర్గాలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. 1997లో స్విట్జర్లాండ్‌లోని జ్యురి చ్‌లో ఈయన వాటాదారుగా ఓ కంపెనీ ఆరంభమైం ది. మొక్కలు, వస్త్రాలు, కళాకృతుల వ్యాపారం కోసం ఫ్లోరా ట్రేడ్‌ను ప్రారంభించారు. తర్వాత దాని పేరును వైల్డ్‌లైఫ్ ట్రేడ్‌గా మార్చారు. దానిని సరుకు రవాణా, మనుషుల రవాణా కంపెనీగా మార్చారు. 1999 నుంచి భారత్‌లో వ్యాపారాలు ఆరంభించారు. 1999లో ఈయన ఎండీగా తరుణి ఇంటర్నేషనల్ ప్రారంభమైంది. తరవాత తరుణి ఇన్‌ఫ్రాతో సహా తరుణి గ్రూప్ పేరిట ఆరేడు కంపెనీలు ప్రారంభించారు. ఇంకా బిసోయిల్ మెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వెంచర్ ఇన్‌ఫ్రా, వెంచర్ ఎనర్జీ, కుమారధార ఎనర్జీ... ఇలా పలు కంపెనీలను ఆరంభించారు. ఈయన మొట్టమొదట ఢిల్లీ చిరునామాతో ఆరంభించిన తరుణి సంస్థలో తెలుగువారైన గేదెల సింహాచలం, వాకమళ్ల అను నాయుడు డెరైక్టర్లుగా ఉన్నా, తర్వాత ప్రారంభించిన కంపెనీల్లో మాత్రం తమిళనాడు, ఢిల్లీలకు చెందినవారే ఎక్కువగా డెరైక్టర్లుగా కొనసాగుతుండటం గమనార్హం. తరుణి ఇన్‌ఫ్రా పేరిట చేపట్టిన ప్రాజెక్టుల్లో... దాదాపు 9 స్వదేశీ హైడ్రో ప్రాజెక్టులుండటం గమనార్హం. అయితే 2012 నాటి కంపెనీ వార్షిక నివేదిక చూసినపుడు మాత్రం... 2012 మార్చి 31 నాటికి అది కేవలం గుజరాత్‌లోని చిన్న హైడ్రో పవర్ ప్లాంట్ నుంచి 3 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించింది. టర్నోవరు రూ.6 కోట్లు.