వృథా పాపం కాంగ్రెస్‌దే
పార్లమెంటు సమావేశాలపై బీజేపీ నేతల ధ్వజం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని పలువురు బీజేపీ సీనియర్ నేతలు విరుచుకుపడ్డారు. గురువారం సమావేశాలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం వారు దేశంలో పలుచోట్ల మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రధాన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. సభలను కాంగ్రెస్ అడ్డుకుంటున్న తీరును జనం ముందు ఎండగట్టాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు వారు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా 28 చోట్ల విలేకర్ల సమావేశాలు ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ నిష్కారణంగా పార్లమెంటును అడ్డుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై విమర్శలు సంధించారు.
ఆ పార్టీ ఓటమిని ఇంకా జీర్ణించుకోవడం లేదన్నారు. సభలను అడ్డుకుంటున్న నేపథ్యంలో సభా నిర్వహణ నిబంధనలను పునః పరిశీలించాల్సిన అవసరముందని మంత్రి వెంకయ్య నాయుడు బెంగళూరులో అన్నారు. సమావేశాలు వృథా కావడానికి కాంగ్రెస్, వామపక్షాలే కారణమని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఆ పార్టీ దేశ ప్రగతిని అడ్డుకుంటోందన్నారు. తాము సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు కాంగ్రెస్, లెఫ్ట్ నేతల నియోజక వర్గాలకు వెళ్లి.. ఆ పార్టీలను ఎండగడతామని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ తెలిపారు. కాగా, మాజీ సైనికులకు ఒకే ర్యాంకు-ఒకే పింఛను విధానం అమల్లో జాప్యంపై రాహుల్ విమర్శపై మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. రాహుల్‌ది బురదజల్లి పారిపోయే వ్యవహారమని దుయ్యబట్టారు. రాహుల్‌కు నాయకత్వ సామర్థ్యాలు లేవని, సోనియా ఆయనను దేశంపై బలవంతంగా రుద్దతున్నారని అన్నారు.