అర్థమైతే యానిమేషన్.. కాకుంటే ఈశ్వరన్! | both naidus play foul game on ap special status | Sakshi
Sakshi News home page

అర్థమైతే యానిమేషన్.. కాకుంటే ఈశ్వరన్!

Published Wed, Oct 7 2015 8:22 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

అర్థమైతే యానిమేషన్.. కాకుంటే ఈశ్వరన్! - Sakshi

అర్థమైతే యానిమేషన్.. కాకుంటే ఈశ్వరన్!

అమృతభాండం కింద పరిచిన దర్భపుల్లలు పాము నాలుకను రెండుగా చీల్చాయి కానీ, అంతవరకూ ఆ నాలుక మామూలుగానే ఉండేది. ప్రత్యేక హోదా ఆశల భాండం కింద పరిచిన ఎన్నికల మేనిఫెస్టో పుస్తకం అట్టలు పదే పదే కొరకడం వల్ల జ్ఞానచంద్రుల నాలుకలు కూడా ప్యాకేజీలో మడతపడి రెండుగా, రెండు రెళ్లు నాలుగుగా, కొన్ని చోట్ల రెండు నాలుగులు ఎనిమిదిగా చీలి బుసలు కొడుతున్నాయి.

కోడలు బాబును కంటానంటే అత్త అమ్మాయిని కనాలని ప్రాధేయపడుతుందా ? అంటూ స్త్రీలను అకారణంగా అవమానించారు తాత బాబు. పేరులో నేమున్నది పెన్నిధి అంటూ నిజానికి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ సర్వోత్తమమైనదని అంటున్నారు... రాజ్యసభలో నానా భాషలు ఆక్రందనలు, ఆవేదనలు, నినాదాల మధ్య కూడా అందరికీ వినిపించేలా హోదా ఐదేళ్లు చాలదు - పదేళ్లు కావాలని ఆనాడు పట్టుబట్టి సాధించిన జ్ఞానవరపు వెంకయామాత్యులు. అందరికీ అరటిపండు వలిచిపెట్టినంత సులభంగా అర్థం కావడానికి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ప్యాకేజీలు రాక అన్నమో రామచంద్రా అని జనం ఎలా అలమటిస్తున్నారో అన్న విషయాన్ని ఇంగ్లీషు, హిందీ, ఆంధ్రం, తెలంగాణలోపాటు లిపిలేని ఇతర కొన్ని భాషల్లో కూడా యంత్ర సమాన వేగంతో చెప్పి మంత్రముగ్ధులను చేస్తున్నారు.

నడిరేయి ఏ జామునో నరేంద్రభాయి మోదీ కనిపించినప్పుడు మముచేర దిగివచ్చునా? నీ పాదాల చెంత, నీ ఏడుకొండల సాక్షిగా, పెద్దన్నగా చెప్పుకొని చేసిన ప్రత్యేక హోదా ప్రమాణం వీడియోను ఆయన సెల్ఫీలకు ఎక్కువగా ఉపయోగించుకునే స్మార్ట్ ఫోన్లో ఒకటికి రెండుసార్లు ప్లే చేయవా అని ఏపీ భక్తులు ఆపదమొక్కుల వాడిని వేడుకుంటున్నారు. బీహారం మెడలో లక్షల కోట్ల ప్యాకేజీ హారం వేసినప్పుడు ఏపీ చిప్పలో కూడా కొన్ని రవ్వలో, గవ్వలో రాలుతాయని భిక్షా పాత్ర కొంచెం ఎత్తిపట్టారు. ఏపీకి భారీ ప్యాకేజీ వండుతున్నట్లు లీకుల వార్తలకు బాగా వండివార్చి ఊరించారు. బీహార్లో ఎన్నికల వైతరణి దాటాలి - ఏపీలో దాటక్కర్లేదు.

అయినా గోదావరి పట్టిసీమ కాలువలో గలాగలా పారి కృష్ణమ్మను దాటుతోంది. రేపొద్దున్న రాయలసీమలో గంతులేస్తుంది. ఇక గోదావరి - పెన్నా, గుండ్లకమ్మమ - కండలేరు, పోతిరెడ్డిపాడు - నాగావళి, పోలవరం - చిత్రావతి, ఝంజావతి -కుముద్వతి చివర గంగ - తుంగ భద్రంగా కలిపి పోబోతున్నాయి. సింగపూర్ ఈశ్వరన్ - అమరావతి అమర చిత్రకథా యానిమేషన్లో పెట్టలేదు కానీ, ఏపీ ఇప్పుడు కోటినదుల సంగమ క్షేత్రం. ఏ పుణ్య తీర్థమేదో, ఏ జలవనరుల నిపుణులు కూడా చెప్పలేరు. పసుపు, పసుపు పూలు చల్లుతూ, పసుపు బట్టలు కట్టుకొని పుణ్య నదీజలాలకు గోల్డెన్ - యెల్లో కలర్లో హారతులివ్వడం, మునగడం తప్ప ముముక్షువులకు ప్రత్యేక హోదాతో పనిఏముంది?

జ్ఞానవరపు చెప్పనే చెప్పారు. నదుల అనుసంధానం గురించి వాజ్పేయి కలగన్నారు - తాత బాబు నెరవేర్చారని. పట్టిసీమ అయిపోయింది, ఇక పోలవరం పట్టుపడదాం అనో, పట్టాలి అనో ఏపీ బీజేపీ హరిబాబు అన్నారు. టీడీపీని ఉద్దేశించి ఏపీ బీజేపీ వాడే క్రియావాచకాలకు శబ్దరత్నాకరం వేరు - అర్థాలు కూడా వేరు. అభ్యర్థనో, ఆదేశమో, పైకి డిమాండుగా కనిపించే వినయపూర్వక సాష్టాంగ నమస్కార సహిత అభ్యర్థనో తేల్చి చెప్పడం శబ్దరత్నాకర కారుడు బహుజనపల్లి బతికి వచ్చినా సాధ్యం కాదు. అయినా తెలుగులో ధ్వని, అలంకారం, శ్లేష అన్నీ జ్ఞానవరపు నాలుక కొసన పుట్టి అక్కడే నాట్యమాడి, అక్కడే లయిస్తాయి కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదాకు మహాభాష్యం కూడా ఆయనే చెప్పాలి.

లౌకికరాజ్యంలో రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తామని చెప్పే ప్రమాణస్వీకార ముహూర్తంలోనే దేవుడి మీద ప్రమాణం చేస్తున్నారు కాబట్టి పూజలు, నోములు, వ్రతాలు ఇంట్లో పెళ్లిలా పంచలు, కండువాలతో కలశంలో కులాచారం ఎందుకు పొంగి పొర్లుతోందని అడగకూడదు. భాష, వేషం, చేతలు అన్నిటికీ స్పష్టంగా కొన్ని ఉద్దేశాలు, లక్ష్యాలు ఉంటాయి. ఏ ప్రతీకలు ఏ పత్రికల్లో ఎలా ఉండాలో, ఏ వీడియో ఏ మీడియాలో ఎలా రావాలో విడివిడిగా లెక్కలుంటాయి. ఇందులో ఎవరికైనా అనుమానాలుంటే పుష్కరంలో ఏలినవారి పుణ్యస్నానంలో పోయినవారి ప్రాణాలను కదిలించండి. సినిమా, టీవీ, జిమ్మీ, డ్రోన్ కెమెరాలేవీ బంధించలేనన్ని కోణాల్లో కన్నీటి దృశ్యాలు హెచ్డి క్లారిటీతో కనిపిస్తాయి. పదుల్లో ప్రాణాలు పోయినా ప్రచారయావ చావని ప్రభుత్వాధినేత మచ్చలను కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఎలా విశ్వరూపం ప్రదర్శించారో యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్కులు ఫాలో అయినవారికి తెలుసు. పుష్కరం, బాహుబలి అటూ ఇటూ రావడం, ఒకేలా ప్రచారం ఉండడంతో చివరకి తెలుగు జనం గోదావరిలో మునగకపోతే జన్మజన్మే కాదు, బాహుబలి చూడకపోతే కళ్లు కళ్లే కాదు అనుకున్నారు. కథ సగంలో లేచిపొమ్మన్నా రాజమౌళిని భళీ అన్నారు. పుష్కరం తొలి ఘడియలో 30 మందిని మింగినా పోనీలెమ్మన్నారు. నిజానికి బాబును చూసే రాజమౌళి ప్రచారంలో మెలకువలు నేర్చుకోవాలి. పుష్కరం సినిమా చూపించిన బాబు ఇప్పుడు అమరావతి సినిమా మీద పడ్డారు.

ఊరూరా పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు, మోపెడు గడ్డి, బారెడు తాడు, దోసెడు పూలు, చిటికెడు పసుపులతో బయలుదేరి హరోం హరోం హర అని శ్రీశ్రీ చెప్పినట్లు అమరావతి చేరుతాయి. తెలుగు జానపదాల నుంచి జనం గుండె లోతుల నుండి ఉబికి ఉబికి, ఉరికి ఉరికి వచ్చిన ఉత్సాహం పునాది మీద సింగపూర్ భవనాలు మొలుస్తాయి. అమరావతి ఆకాశహర్మ్యాలను చూసి అసలు సింగపూర్ భవనాలు అసూయపడతాయి - సిగ్గుతో తలదించుకుంటాయి. మరో సింగపూర్ కోసం భూములిచ్చినవారికి పంచె - కండువా, చీర - రవిక శేషవస్త్రంగా కలకాలం మిగిలిపోతాయి.

అసూయపడేలా తయారయ్యే అమరావతిలో వంక పెట్టడానికి అసలు వంకర్లే ఉండవు. పలకలు పలకలుగా పల్లవించే రాజధాని పాటలు ఎందరో శంకరంబాడి సుందరాచారుల నాలుకలపై అప్పుడే నర్తిస్తున్నాయి. మన చెవుల్లో రింగుమని ఇక మారుమోగుతాయి. రాజధాని వల్ల, రాజధాని కోసం, రాజధాని చేత నడిచే రాజకీయాన్ని తెలుగువారి సెంటిమెంటుతో ముడిపడిన అంశంగా మలచాలన్నది పసుపుగణం ప్రయత్నం.

రాని హోదా కోసం వచ్చే ప్యాకేజీలు వదులుకోకు లోకేశా అని సన్రైజింగ్ కొత్త రాష్ట్రం జనం ప్రాధేయపడేలా చేయగలనని బాబు అనుకుంటున్నారు. రాజధాని మోజులో, వాటర్ ఫ్రంట్ వాస్తులో రాయలసీమను గాలికొదిలేశారు. సీమలో ఎప్పుడు మాట్లాడినా కరువు అసూయపడేలా, కరువు కుళ్లి కుళ్లి చచ్చేలా, గోదావరి జిల్లాలవారు ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చేస్తానంటారు. కానీ నీళ్లయినా, నిధులయినా గన్నవరం ఎయిర్పోర్ట్, అమరావతి వాటర్ ఫ్రంట్ దాటి రావు, రాలేవు. కర్నూలు చేసిన పాపమేమిటి లోకాధీశా అని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం గుండెలు బాదుకుంటున్నారు. అపార తీరప్రాంతం, అద్భుతమైన వనరులు, అడుగడుగునా వజ్ర వైఢూర్యాలు పొంగిపొర్లే సన్రైజింగ్ స్టేట్ కేపిటల్ను కవాలంటూ ముప్పై రోజులకు అరవై అంతస్తుల చొప్పున ఆరవై రోజులకు నూట ఇరవై అంతస్తులు కట్టే చైనా కోటగోడ సూత్రం ఉందంటున్నారు బాబు.

సింగపూర్ ఈశ్వరన్ స్విస్ ఛాలెంజ్లో సింగపూర్ను వదిలి అమరావతి వాటర్ ఫ్రంట్లో అహోరాత్రులు కూర్చుంటారు. హిజ్ ఎక్సలెన్సీ ఈశ్వరన్ అవర్ ఎక్సలెన్సీ బాబును చూసి సర్వీసులన్నీ ఫ్రీగా అందిస్తారు. తిరుపతి ప్రసాదం, పుష్కరం హారతికే ఉచితంగా అమరావతీ నగర అపురూప సౌధాలు మనకిస్తున్న సింగపూర్ ఈశ్వరన్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా మన కృతజ్ఞత తక్కువే అవుతుంది. వెనకటికి .. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత... అన్నాడట.

వంకర్లు వీలులేని రాజధాని శంకుస్థాపనకు వంద విమానాల్లో రమ్మన్నారు కానీ, అదే నోటితో ప్రత్యేక హోదా ఏమయ్యిందని నీళ్లు నములుతూ కూడా అడగలేకపోయారు. రాజమౌళి తాతగా ప్రస్తుతానికి బాబు చూపించింది గ్రాఫిక్స్ మాత్రమే. యానిమేషన్ వీడియోలు ఇంకా తయారవుతున్నాయి. చతురస్రాకార, దీర్ఘ చతురస్రాకార పలకల్లో నింగికి నేలకు నిచ్చెనగా రేపు రాబోయే యానిమేషన్ భవనాల పనితనం చూశాక తుళ్లూరు ముళ్ల కంచెల వెంబడి బాలీవుడ్, హాలీవుడ్ యానిమేషన్ పనుల కోసం కాపుకాస్తాయి. వెయ్యేళ్లకు నిలిచి వెలిగే అమరావతి ముందు ప్రత్యేక హోదా దూది పింజ. దేన్ని ఎప్పుడు ఎలా వాడుకుని పారేయాల్లో, ఎలా ఎప్పుడు దేన్ని ఊది పారేయాలో సన్ రైజింగ్ బాబును అడగండి - స్విస్ ఛాలెంజ్లో సమాధానం చెబుతారు.

అర్థమైతే యానిమేషన్
కాకుంటే ఈశ్వరన్
అయ్యీ కానట్లుంటే పరకాల విల్ బ్రీఫ్ యు


- తిరుపతి కాశ్యప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement