
టికెట్ కొనకుంటే రైలులో నుంచి తోసేస్తారా?
భువనేశ్వర్: విశాఖపట్నానికి చెందిన పి.కృష్ణ 15 ఏళ్ల బాలుడు. ఒడిశాలోని కటక్ లో ఉంటోన్న బంధువుల దగ్గరికి వెళ్లేందుకు శనివారం ఒంటరిగా విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే కోరమండల్ ఎక్స్ ప్రెస్ (చెన్నై- హౌరా) రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. దాంతో పరుగున వెళ్లి ఒక బోగీలో ఎక్కేశాడు. దురదృష్టవశాత్తూ అది రిజర్వ్డ్ (ఎస్10) బోగీ.. పైగా తాను టికెట్ కూడా కొనలేదు. కొద్ది దూరం వెళ్లాక టీటీఈ ప్రత్యక్షమయ్యాడు. టికెట్ చూపించమని గదమాయిచాడు. భయంతో వణికిపోయిన బాలుడు.. టికెట్ కొనలేదని చెప్పాడు. అంతే..
టీటీఈకి కోపం ముంచుకొచ్చింది. ఆ కోపంలో విచక్షణ కోల్పోయి.. వేగంగా కదులుతున్న రైలులో నుంచి కృష్ణను కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ బాలుడు ప్రస్తుతం భువనేశ్వర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రాక్ పక్కన గాయాలతో పడిఉన్న కృష్ణను జీఆర్ పీ పోలీసులు గుర్తించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఉంటోన్న బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, రైలులో నుంచి తోసేసిన టీటీఈపై శాఖా పరమైన విచారణ జరుపుతామని రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. టికెట్ లేని ప్రయాణం నేరమే. అందుకు చట్టప్రకారం జరిమానా విధించడమో లేదా రైల్వే పోలీసులకు అప్పగించడమో చేయాలి. కాని ఇలా కదులుతున్న రైలులో నుంచి తోసివేయడం ఘోరనేరం కాదంటారా!