కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్
బెంగుళూరు: కాల్ సెంటర్ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం కేసులో బెంగుళూరు పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ ఎన్ ఎస్ మేగారిక్ మంగళవారం వెల్లడించారు.
అక్టోబర్ 3వ తేదీన కాల్ సెంటర్ ఉద్యోగిని(23) విధులు ముగించుకుని... ఇంటికి వెళ్లేందుకు రహదారిపై ప్రైవేట్ ట్యాక్సీ కోసం వేచి చూస్తుంది. ఆ క్రమంలో మినీ బస్సు వచ్చింది. దీంతో ఆమె ఆ వాహనం ఎక్కింది. బస్సును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అనంతరం ఆమెను కత్తితో బెదిరించి డ్రైవర్, క్లీనర్ అత్యాచారం చేశారు.
తర్వాత ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో పడేశారు. దాంతో ఆమె తన సోదరితోపాటు స్నేహితులకు సమాచారం అందించింది. బాధితురాలిని సెయింట్ జోన్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలి వద్దకు వచ్చి ఫిర్యాదు స్వీకరించారు.