పన్నెండు రోజుల కిందటే దేశంలోకి..
ఉదంపూర్: పన్నెండు రోజుల కిందటే తాము భారత దేశంలోకి చొరబడ్డామని పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ తెలిపాడు. తాను చేస్తుంది తప్పని ఏమాత్రం భావించకుండా పైగా చతుర్లు విసిరినట్లుగా మాట్లాడుతూ బీఎస్ఎఫ్ బలగాల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ రోజు ఉదయం ఉదంపూర్ సమీపంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని సైన్యం అదుపులోకి తీసుకోగా.. మరొకరు కాల్పుల్లో చనిపోయాడు. సైన్యం చేతికి చిక్కిన ఉస్మాన్ చుట్టూ పోలీసులు చుట్టు ముట్టి ప్రశ్నల వర్షం కురిపించగా అతడు తాఫీగా నవ్వుతూ సమాధానం చెప్పాడు.
'మేమిద్దరమే. పన్నెండు రోజుల కిందటే భారత్లోకి అటవీ మార్గం ద్వారా అడుగుపెట్టాం. అవును ఇక్కడికి ఏ బస్సు వస్తుంది' అని ఎదురు ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఆహారం ఎవరు అందించారని ప్రశ్నించగా తాము తెచ్చుకున్న ఆహారం మూడు రోజుల్లో అయిపోయిందని, అందుకే ఓ ఇంటి తాళం పగుల గొట్టి సమకూర్చుకున్నామని బదులిచ్చాడు. తాము పాక్ లోని ఫైసలాబాద్కు చెందినవారిమని సమాధానం చెప్పాడు. ఫైసలాబాద్లో జైసే ఈ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిని మౌలానా మసూద్ అజర్ నడుపుతున్నాడు.