రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
* హార్దిక్ పటేల్ వెనక సంఘ్ పరివార్ హస్తం
* రౌండ్ టేబుల్ చర్చలో బీసీ నేతల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అమలవుతున్న రిజర్వేషన్లను రద్దు చేయించేందుకు కుట్ర జరుగుతోందని బీసీ సంఘాలు భయాందోళన వ్యక్తం చేశాయి. గుజరాత్‌లో మానసిక పరిపక్వత లేని 22 ఏళ్ల హార్దిక్ పటేల్‌ను ముందుంచి తెర వెనక సంఘ్ పరివార్ శక్తులు కథ నడుపుతున్నాయని ఆరోపించాయి.
ఓబీసీ రిజర్వేషన్ల కోసం గుజరాత్‌లో పట్టీదార్లు చేస్తున్న ఆందోళన.. అసలు ఉద్యమమే కాదని, ఇది ఫక్తుగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమమని అభిప్రాయపడ్డాయి. ‘గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమం-సామాజిక పరిణామాలు’ అంశంపై బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.
పటేళ్లను ఓబీసీల్లో చేరిస్తే పరిస్థితులు రణరంగమవుతాయని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణయ్య పేర్కొన్నారు. 80 శాతం మార్కులొచ్చినా పటేళ్లకు ఉద్యోగాలు రావడం లేదని, రిజర్వేషన్ల వల్ల 49 శాతం మార్కులొచ్చిన వారికీ ఉద్యోగాలొస్తున్నాయని హార్దిక్ పటేల్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. గుజరాత్ జనాభాలో 14 శాతమే ఉన్న పటేళ్ల వద్దే ఆ రాష్ట్ర సంపదలో 65 శాతం ఉందన్నారు.
బీసీ కోటాను 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జరుగుతున్న ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఆరెస్సెస్ కుట్ర చేస్తోందని ప్రొఫెసర్లు పీఎల్ విశ్వేశ్వర రావు, గాలి వినోద్ కుమార్, సత్యనారాయణలు పేర్కొన్నారు. కార్యక్రమంలో వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.