
ఆదమరిచి నిద్రిస్తున్న కూలీలపైకి..
లక్నోలో కారు బీభత్సం
లక్నో: నైట్ షెల్టర్‌లో ఆదమరిచి నిద్రిస్తున్న నిరుపేద కార్మికులపైకి ఓ కారు దూసుకుపోయింది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన ఓ వ్యక్తి నలుగురు కూలీల ప్రాణాలను బలిగొన్నాడు. పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నో దలిబాఘ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడైన వ్యక్తి హ్యుండయ్ ఐ-20 కారు అతివేగంగా నడుపుతూ.. అదుపుతప్పి నైట్ షెల్టర్‌లోకి దూసుకుపోయాడు. ఆ సమయంలో షెల్టర్‌లో 35మంది కూలీల వరకు నిద్రిస్తున్నారు. తూర్పు యూపీకి చెందిన నిరుపేద దినసరి కూలీలు నలుగురు ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. మద్యం మత్తులో జోగుతున్న ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారు. వారిలో ఒకడు స్థానిక రాజకీయ నాయకుడి కొడుకు అని తెలుస్తోంది. అతివేగంగా ర్యాష్‌గా నడుపడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు చెప్తున్నారు. కారులోని ఇద్దరు వ్యక్తులను వారు అదుపులోకి తీసుకున్నారు.