
మాయావతి ఆస్తులపై విచారణ చాలించిన సీబీఐ
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ మొదలుపెట్టిన కేసు విచారణను సీబీఐ చాలించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చినందున, ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగించడం సరికాదని న్యాయసలహా రావడంతో కేసు మూసేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గత సంవత్సరమే మాయావతి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ దాఖలుచేసిన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు కొట్టేసినా, తర్వాత ఓ ప్రైవేటు వ్యక్తి కూడా ఈ కేసులో కలగజేసుకోవడంతో మళ్లీ ఇది మొదటికొచ్చింది. కానీ, ఇటీవల.. ఆగస్టు 8న సుప్రీంకోర్టు ఆ జోక్యాన్ని కూడా కొట్టేసింది. దీంతో మాయావతిపై కేసు మూసేయడానికి మార్గం సుగమమైంది.
ఉత్తరప్రదేశ్కు చెందిన కమలేష్ వర్మ అనే వ్యక్తి.. మాయావతి అక్రమాస్తుల కేసు విషయమై సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేయగా, ఆగస్టు 8న సుప్రీం ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులు తాజ్ కారిడార్ కేసుకు మాత్రమే సంబంధించినవని, వాటిని సరిగా అర్థం చేసుకోకుండా సీబీఐ కేసు విషయంలో ముందుకెళ్లిందని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. అయితే.. మాయావతిపై వేరే కేసు దర్యాప్తు చేయడానికి సీబీఐకి ఉన్న అధికారాలను మాత్రం తాము ప్రశ్నించబోమని సుప్రీం తన తీర్పులో తెలిపింది. తొమ్మిదేళ్లుగా నలుగుతున్న అక్రమాస్తుల కేసును సుప్రీం గత సంవత్సరం జూలై 6న కొట్టేసింది. తమనుంచి ఎలాంటి సూచనలు లేకపోయినా ఎఫ్ఐఆర్ దాఖలుచేయడం ద్వారా సీబీఐ తన పరిధులను అతిక్రమించిందంటూ తలంటింది కూడా!!