25 నుంచి బాబు బస్సుయాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి అందుకు కారణమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో బస్సుయాత్రకు సిద్ధమయ్యారు. మీకోసం యాత్ర ముగించిన విశాఖపట్నం నుంచి ఈ నెల 25న యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. తొలివిడతగా విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. యాత్ర విషయమై అందుబాటులో ఉన్న నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, విజయ రమణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గరికపాటి మోహనరావులతో బుధవారం ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
ఈనెల 25 నుంచి బస్సు యాత్ర చేయాలనుకుంటున్నానని, ఒకవేళ ఆ రోజు అనువుకాని పక్షంలో 27 లేదా 29 తేదీల్లో ప్రారంభిస్తానని వారితో చెప్పారు. అయితే ప్రస్తుతం యాత్ర చేపట్టడం మంచిది కాదని సమావేశంలో పాల్గొన్న సీమాంధ్ర ప్రాంత నేతలు సూచించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించిన రోజున సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయల నిధులివ్వాలని కోరడంపై కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో యాత్ర చేపట్టడమే తప్పయితే, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయడానికే బస్సుయాత్ర చేస్తున్నానని చెబితే నమ్మేవారెవరూ ఉండరని హెచ్చరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు 23, 24 తేదీల్లో రెండు ప్రాంతాల నేతలతో విడివిడిగా సమావేశం కానున్నట్లు తెలిపాయి.
భారీ బందోబస్తు మధ్య: చంద్రబాబు బస్సు యాత్రకు భారీగా రక్షణ వలయం ఏర్పరచాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బస్సుయాత్ర చేస్తానని ప్రకటించాక వెనక్కు తగ్గితే భయపడి రాలేదన్న విమర్శలు వస్తాయన్న అంశంపై వారు తర్జనభర్జన పడ్డారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లా పాలకుర్తికి రైతు పోరుబాట పేరుతో పర్యటించినప్పుడు చంద్రబాబుకు రక్షణ వలయంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు పెద్దఎత్తున కార్యకర్తలను సమీకరించి భారీ వాహన కాన్వాయ్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చేపట్టే బస్సుయాత్రకు కూడా అలాంటి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వాహన శ్రేణి ఏ విధంగా చంద్రబాబు వాహనం వెంట ఉండాలో ముందే నిర్ణయించి, ఎక్కడికక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి కార్యకర్తలను సమీకరించి, బస్సుయాత్ర పూర్తయ్యేవరకు వారు బాబు వెంటే ఉండేలా కార్యచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నేతలు మాత్రం తెలంగాణకు అనుకూలంగా పార్టీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని చెప్పాలని కోరగా చంద్రబాబు అంగీకరించినట్లు తెలిసింది.