
సీఎం ఉన్నాడా? : చంద్రబాబు
సాక్షి, ఏలూరు: తుపాన్ల బాధితులను పరామర్శించేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తీరిక లేదా? అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సోనియా గాంధీ తన కొడుకును ప్రధానిని చేసేందుకు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ తుపానులో దెబ్బతిన్న పంటలను ఆయన మంగళవారం పరిశీలించారు. తర్వాత పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. యలమంచిలి, పాల కొల్లు, నరసాపురం, వీరవాసరం, భీమవరం మండలాల్లో బాబు పర్యటించారు.
ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఈ విపత్తు ప్రకృతి తెచ్చింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. మా హయాంలో విపత్తులు వచ్చిన వెంటనే బాధితులకు పరిహారం ఇచ్చాం. కిరణ్‌కు బాధితులను పరామర్శించే తీరిక కూడా లేకపోవడం విచారకరం. రాష్ట్రంలో అసలు సీఎం ఉన్నాడా? పాలన జరుగుతోందా?’ అని విమర్శించారు. తాను అధికారంలోకి రాగానే రైతుల పంట రుణాలు మాఫీ చేయిస్తానని, బెల్టు షాపులను మూయిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తానని, రైతుమిత్ర సంఘాలను పునరుద్ధరిస్తానని చెప్పారు.
రాజ్యాంగ విరుద్ధంగా విభజన..: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా, రాజ్యాంగ విరుద్ధంగా విభజించాలని చూస్తోందని బాబు ధ్వజమెత్తారు. సోనియా తన కొడుకును ప్రధానిని చేయడానికి కావాల్సిన సీట్ల కోసం తెలంగాణలో కేసీఆర్, సీమాంధ్రలో జగన్‌ల ప్రోత్సాహంతో విభజనకు సిద్ధపడ్డారన్నారు. అన్ని సమస్యలకూ కారణం సోనియానే అని, టీడీపీని దెబ్బతీయడానికి మొత్తం తెలుగుజాతినే విడదీయాలని చూస్తున్న ఆమె అతి తెలివైన నాయకురాలని ఎద్దేవా చేశారు.
బాబుకు సమైక్య సెగ..: పశ్చిమ గోదావరి పర్యటనలో బాబుకు సమైక్య సెగ తగిలింది. ఆయన పాలకొల్లు మండలం దిగమర్రుకు చేరుకున్నప్పుడు అక్కడి పాఠశాల విద్యార్థులు సమైక్య నినాదాలు చేశారు. నరసాపురం మండలం బేతపూడి వద్ద జీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, స్థానికులు.. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని బాబును డిమాండ్ చేశారు. పర్యటనలో బాబుపంచారామ క్షేత్రమైన భీమవరం గునుపూడిలోని సోమేశ్వరుడిని దర్శించుకున్నారు.
మీ పిల్లలకు పదవులు.. మా పిల్లలకు సీసాలా?
బాబును నిలదీసిన టీడీపీ నాయకురాలు
యలమంచిలి, న్యూస్‌లైన్: యలమంచిలి పర్యటనలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రైతులు తమ బాధలు చెప్పుకోవాలని బాబు వారికి మైక్ అందించగా ఓ మహిళ మద్య నిషేధంపై ఆయన వైఖరిని దుయ్యబట్టింది. ‘మీ పిల్లలకు పదవులు, మా పిల్లలకు మద్యం సీసాలా?’ అంటూ మండిపడింది. ‘నా పేరు తమ్మినీడి ఊర్మిళ. టీడీపీ నాయకురాలిని. 1999 ఎన్నిక లప్పుడు మీరు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. తర్వాత నిషేధానికి తూట్లు పొడిచారు. మీ వారసులకు పదవుల కోసం మా బతుకులతో ఆడుకుంటారా! మా పిల్లలు నిరుద్యోగుల్లా బతకాలా? మాకేమీ వద్దు.. మద్యం షాపులు మూయించండి చాలు’ అని అంది. దీంతో బిత్తరపోయిన బాబు సమాధానం చెప్పకుండా మరో రైతుకు మైక్ ఇచ్చారు.