
కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు కొత్త మెలిక
విశాఖపట్నం: కాపు రిజర్వేషన్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పిల్లిమొగ్గ వేశారు. ‘కాకులకు మందుపెట్టి కట్టమీద కూర్చున్న’ చందంగా రిజర్వేషన్ అంశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. మంజునాథన్ కమిటీ రిపోర్టు రాగానే కాపులను బీసీలో చేర్చుతామని గతంలో ప్రకటించిన ఆయన తాజాగా స్వరం మార్చారు.
విశాఖపట్నంలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు.. ‘త్వరలోనే మంజునాథన్ కమిటీ రిపోర్టు వస్తుంది. దానిపై తొలుత తెలుగుదేశం పార్టీలో చర్చ చేపడతాం. అటుపై ప్రజల్లోకి వెళతాం. ప్రతిస్పందనను బట్టి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం..’ అని ప్రకటించారు.
సిద్ధాంతాలు లేవన్న బాబు
తనను తాను రాజకీయ ధురంధరుడిగా చెప్పుకునే చంద్రబాబు రాజకీయ సిద్ధాంతాలపై ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో ఒకప్పుడు సిద్ధాంతాలు ఉండేవి. ఇప్పుడు లేవు. కాబట్టి సమయానుకూలంగా వాస్తవ రాజకీయాలనే నెరపాలి’ అని బాబు అన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో ఏ ఒక్కరు తప్పుచేసినా క్షమించబోనని పేర్కొన్నారు.