► సిఫార్సు చేయనున్న లా కమిషన్
న్యూఢిల్లీ: బెయిల్ మంజూరు నిబంధనల్లో మార్పులు చేయాలని లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఏడేళ్ల జైలుశిక్ష పడే నేరాల కేసుల్లో విచారణ ఖైదీలుగా ఉన్నవారు ఆ శిక్షలో మూడోవంతు(రెండున్నరేళ్లు) కాలం జైల్లో పూర్తి చేసుకుని ఉంటే వారిని బెయిల్‌పై విడుదల చేయాలని సూచించనుంది. సీఆర్‌పీసీలోని ‘426 ఏ’ సెక్షన్‌ను సవరించాలని సిఫార్సు చేయనుందని కమిషన్‌లో సభ్యుడిగా ఉన్న సీనియర్ అధికారి తెలిపారు.
‘డబ్బు పూచీకత్తు ఇవ్వలేని విచారణ ఖైదీలకు వారి ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డులను ప్రభుత్వం డిపాజిట్ చేసుకుని బెయిల్ ఇవ్వాలని సూచించనుంది. ఈ కార్డులను డిపాజిట్ చేసిన వ్యక్తి తిరిగి జైలుకు రాకపోతే ఏం చేయాలన్నదానిపై ఆలోచిస్తున్నాం’అని వెల్లడించారు. కొత్త బెయిల్ చట్టాన్ని సిఫార్సు చేయాలని గతేడాది లా కమిషన్‌కు కోరిన ప్రభుత్వం తర్వాత నిర్ణయం మార్చుకుని, బెయిల్‌ను సులభంగా మంజూరు చేసేందుకు సీఆర్‌పీసీలో మార్పులను సూచిస్తే చాలని చెప్పింది.