తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలి
4.5 కోట్ల మంది ప్రజలను ఆయన మోసం చేశారు: గండ్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద స్పీకర్ కార్యాలయాన్ని వివరణ కోరగా తలసాని తన రాజీనామా లేఖ పంపలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసగించినందుకు తలసానిపై సుమోటోగా చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద గండ్ర మీడియాతో మాట్లాడుతూ తలసాని రాజీనామాకు సంబంధించి తమకు మొదటి నుంచి అనుమానం రావడంతో ఆర్టీఐ ద్వారా వివరాలు కోరగా అసలు విషయం బయటపడిందన్నారు. రాజీనామా లేఖ ఇవ్వకుండానే, ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. తలసాని మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందున గవర్నర్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి చేత రాజీనామా చేయించకుండానే మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఏ రకమైన ఆదర్శ పాలనవుతుందని ఎద్దేవా చేశారు.
తలసానిపై 420 కేసు పెట్టాలి: షబ్బీర్
రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు మంత్రి తలసానిపై తక్షణమే సుమోటోగా 420 కేసు నమోదు చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీని తలసాని అవమానపరిచారని మండిపడ్డారు. తలసాని దుశ్చర్యపై పార్లమెంటులో తమ పార్టీ తరఫున చర్చకు పట్టుబడుతామన్నారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో షబ్బీర్ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతనే లేదని ధ్వజమెత్తారు.
సీఎం ఓవైపు నీతి వాక్యాలు వల్లిస్తూ మరోవైపు రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తలసాని రాజీనామా విషయంలో గవర్నర్ నరసింహన్ పాత్రపైనా అనుమానం కలుగుతోందని షబ్బీర్ పేర్కొన్నారు. తలసాని రాజీనామా చేశారా లేదా అని గవర్నర్ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్‌కు నిజాయితీ ఉంటే ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగరాదన్నారు. ఆయనకు పదవిలో ఉండే అర్హత లేదన్నారు.