చైనాలో కొండచరియల బీభత్సం
- సిచువాన్ ప్రావిన్సులో 15 మంది మృతి
- శిథిలాల కింద 120 మంది
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడి 15 మృతి చెందగా, మరో 120 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా మౌగ్జియాన్ కౌంటీలోని జిన్మో గ్రామంపై శనివారం ఉదయం 6 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొత్తం 62 ఇళ్లు కూలిపోయాయి. 1.6 కి.మీ పొడవునా రోడ్డు ధ్వంసం అయ్యింది. ఆ ప్రాంతంలోని నదిలో దాదాపు రెండు కి.మీ పొడవునా రాళ్లు చేరాయి. ఏకంగా అక్కడి పర్వతంలోని కొంత భాగం కూలిపోయింది. జిన్మో గ్రామం పర్వతాల నడుమ లోయలో ఉంటుంది. శనివారం మొత్తం రెండుసార్లు కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డట్టు సమాచారం. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని కాపాడటానికి సర్వశక్తులూ ఒడ్డాలని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు.
ప్రమాదానికి పూర్తి కారణాలను అన్వేషించాలని చైనా ప్రధాని లీ కెఖియాంగ్ ఆదేశించారు. రెండు వేల మంది సిబ్బంది, భూగర్భ, జల శాస్త్రవేత్తలు, సర్వే నిపుణులు డ్రోన్లు, లేజర్ స్కానర్లు తదితర పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సజీవంగా బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలోని రోడ్లను మూసివేశారు. కొండ చరియలకు సంబంధించి రెండో ప్రమాద హెచ్చరికను చైనా జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొండచరియలు విరిగి పడటానికి స్వల్ప భూకంపం, భారీ వర్షాలే కారణమైనప్పటికీ.. ఆ ప్రాంతంలో చెట్లు లేకపోవడం పరిస్థితిని దారుణంగా మార్చిందని అధికారులు వెల్లడించారు.