
అమెరికాకు చైనా వార్నింగ్!
బీజింగ్: దక్షిణ కొరియాలో అమెరికా మోహరిస్తున్న క్షిపణి రక్షక వ్యవస్థపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణి వ్యవస్థకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, దీని పరిణామాలను అమెరికా, దక్షిణ కొరియా ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
దక్షిణ కొరియాలో క్షిపణి రక్షక వ్యవస్థ ఏర్పాటును చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షౌంగ్ మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే అమెరికా మిస్సైల్ లాంచర్లు, ఇతర సామగ్రి దక్షిణ కొరియా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రత ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా కచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని జెంగ్ చెప్పారు. తాజా చర్యల నేపథ్యంలో ఎదురయ్యే పరిణామాలకు అమెరికా, దక్షిణకొరియానే బాధ్యత వహించాలని అన్నారు. ఉత్తరకొరియా నాలుగు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన నేపథ్యంలో తన మిత్రపక్షమైన దక్షిణకొరియాలో అమెరికా క్షిపణి రక్షక వ్యవస్థను ఏర్పాటును తలపెట్టింది.