అధైర్యపడొద్దు... అండగా ఉంటా
* సవతితల్లి చిత్రహింసల్లో గాయపడ్డ ప్రత్యూషకు సీఎం హామీ
* భార్య, కూతురుతో కలసి ఆసుపత్రిలో పరామర్శ
* హాస్టల్ వసతి కల్పిస్తా, బాగా చదువుకో.. సెలవుల్లో మా ఇంటికి రా..
* ఇల్లు కట్టించి నా సొంత ఖర్చులతో పెళ్లి జరిపిస్తా: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఎవరూ లేరని బాధపడొద్దు. జరిగిన దానిని పీడ కలలా మర్చిపో. నీకు నేనున్నాను. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నా ఇంటికి రా. నీకు మంచి హాస్టల్లో వసతి కల్పించి చదువు చెప్పిస్తా. సెలవుల్లో వచ్చి మా ఇంట్లోనే ఉండు. నీకు నా కూతురు (నిజామాబాద్ ఎంపీ కవిత) తోడుగా ఉంటుంది. సొంత బిడ్డలా చూసుకుంటా. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి జరిపిస్తా’ అంటూ ప్రత్యూషకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఆస్తి కోసం కన్నతండ్రి రమేశ్, సవతి తల్లి చాముండేశ్వరి పెట్టిన చిత్రహింసల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను కేసీఆర్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా పరామర్శించారు.
భార్య శోభారాణి, కూతురు కవితతో కలసి ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్...ప్రత్యూషతో మాట్లాడారు. ‘జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడాలి. జీవితం ఇంకా చాలా వుంది. కొత్త జీవితం ప్రారంభించి నిలదొక్కుకోవాలి. బాగా చదివి పైకిరావాలి. రేపు నీలాగా ఇంకా ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే పరిస్థితిలో నువ్వుండాలి. నీకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నాడనే ధైర్యంతో ఉండు. నీకు పోలీసు కాపలా పెట్టిస్తా. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా నిన్ను చూసుకుంటడు’ అంటూ ప్రత్యూషకు కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రత్యూషకు పండ్ల బుట్టతోపాటు చేతి ఖర్చుల కోసం కొంత నగదు కూడా అందించారు.
వాళ్లను బయటకు రానీయొద్దు: ప్రత్యూష
ఇంకా ఏమైనా చెప్పదల్చుకున్నావా అని సీఎం అడగ్గా భావోద్వేగానికి గురైన ప్రత్యూష...తనను ఈ స్థితికి తెచ్చిన సవతి తల్లి, తండ్రిని జైల్లోంచి బయటకు రానీయొద్దని కేసీఆర్‌ను వేడుకుంది. ‘వాళ్లిద్దరూ కొడుతున్నట్లు ఇంకా కలలు వస్తూనే ఉన్నాయి. వారంటేనే భయమేస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి కేసీఆర్ స్పందిస్తూ ‘ఇకపై నీకేమీ కాదు. అన్నింటికీ నేనున్నా’ అని భరోసా ఇచ్చారు. ప్రత్యూషను చిత్ర హింసలు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
డిశ్చార్జి అయ్యాక ఇంటికి తీసుకెళ్తా...
ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాక తన ఇంటికి తీసుకెళ్తానని కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. ఆసుపత్రి నిర్వాహకులు రవీంద్రనాథ్‌తోపాటు ప్రత్యూషకు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడిన సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడినా ఇంకా నీరసంగానే ఉందని వైద్యులు ఈ సందర్భంగా కేసీఆర్‌కు వివరించగా మరో వారంపాటు చికిత్స అందించి పూర్తిగా కోలుకున్నాకే డిశ్చార్జి చేయాలని వైద్యులకు సూచించారు. ప్రత్యూష ఆరోగ్యం, భద్రత వ్యవహారాలను చూడాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు. ఇంట్లో భయంకర పరిస్థితులు ఉండటం వల్ల ప్రత్యూష చదువుకోలేక పోయిందని...ఆమె కోరిక మేరకు బీఎస్సీ నర్సింగ్ చదివిస్తానని సీఎం హామీ ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. సీఎం వెంట ఆస్పత్రికి వెళ్లిన వారిలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ సుమన్ , జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు.