మార్చి నాటికి పాలమూరు ప్రాజెక్టుల పూర్తి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్ ప్రాజెక్టులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి భీమా కింద 2 లక్షల ఎకరాలకు, కల్వకుర్తి కింద 3.04 లక్షలు, నె ట్టెంపాడు కింద 2 లక్షలు, కోయల్‌సాగర్ కింద 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్నారు. శుక్రవారం ప్రాజెక్టుల అధికారులు, కాంట్రాక్టర్లు, భూసేకరణ అధికారులు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులతో ఆయకట్టు అభివృద్ధి సంస్థ కార్యాలయంలో హరీశ్‌రావు సమావేశమయ్యారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే ఉద్దేశంతోనే 146, 123 జీవోలను ప్రభుత్వం తెచ్చిందని, వాటిని వినియోగించుకొని పనులు వేగిరం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లలో ఎవరు అలసత్వం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన ఇసుకపైనా సమావేశంలో చర్చించారు. జిల్లాలో గుర్తించిన 22 ఇసుక పట్టా భూములను ప్రభుత్వ వినియోగానికి మాత్రమే వాడాలని ఆదేశించారు.
వేగం పెరిగేనా?: భూసేకరణ, పరిహారం, ఎస్కలే షన్ చెల్లింపులు వంటి సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చిన తరుణంలోనైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు పట్టిన గ్రహణం వీడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2016-17 ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టుల్లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులే ముందు వరుసలో ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎస్కలేషన్ డిమాండ్ చేస్తూ ఏడాదిన్నరగా పనులు నిలిపివేశారు.
దీంతో లక్ష్యం మేరకు ఆయకట్టు అందుబాటులోకి రాలేదు. కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు ఎస్కలేషన్‌కు ప్రభుత్వం అంగీకరించింది. నాలుగు ప్రాజెక్టుల్లోని 36 ప్యాకేజీలకు సుమారు రూ.500కోట్ల మేర అదనంగా చెల్లించనుంది. ఇక జీవో 123తో భూసేకరణను కూడా ప్రభుత్వం వేగిరం చేసింది. ఈ నేపథ్యంలోనే పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను హరీశ్‌రావు ఆదేశించారు.