
కానిస్టేబుళ్ల నియామకాలకు వారం బ్రేక్
- కటాఫ్ మార్కులకన్నా తక్కువొచ్చినా జనరల్ కేటగిరీలోకా?
- అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు
- జనరల్ కేటగిరీ ఖాళీల్లో అలాంటి భర్తీకి వీల్లేదని స్పష్టీకరణ
- వారంపాటు నియామకపు ఉత్తర్వులివ్వబోమని సర్కారు హామీ
సాక్షి, హైదరాబాద్
పోలీసు కానిస్టేబుళ్ల నియామకపు ప్రక్రియలో జనరల్ కేటగిరీ (ఓపెన్ కేటగిరీ) అభ్యర్థులకు నిర్దేశించిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చిన మిగిలిన కేటగిరీ అభ్యర్థులకు జనరల్ కేటగిరీలో స్థానం కల్పించడంపై ఉమ్మడి హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. జనరల్ కేటగిరీలో నిర్దేశించిన మార్కులు వచ్చిన వారికే ఆ కేటగిరీ కింద స్థానం కల్పించాలే తప్ప తక్కువ మార్కులొచ్చిన వారిని జనరల్ కేటగిరీ ఖాళీల్లో భర్తీ చేయడానికి వీల్లేదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు 80 అయినప్పుడు 63 మార్కులొచ్చిన హోంగార్డులను జనరల్ కేటగిరీలో ఎలా చేరుస్తారని నిలదీసింది. ఈ నేపథ్యంలో వారంపాటు కానిస్టేబుళ్ల నియామకపు ఉత్తర్వులను జారీ చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది.
ఈ హామీని రికార్డ్ చేసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని... ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) బి.మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జనరల్ కేటగిరీలో మిగిలిపోయిన ఖాళీలను ఇతర కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తున్నామన్నారు. అందువల్ల ఇతర కేటగిరీల అభ్యర్థులకు జనరల్ కేటగిరీకి నిర్దేశించిన కటాఫ్ మార్కులు రావాల్సిన అవసరం లేదన్నారు.
అయితే ఈ వాదనతో ధర్మాసనం విభేదించింది. ప్రాథమికంగా చూస్తే సర్కారు అనుసరిస్తున్న విధానం తప్పని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌జీపీ స్పందిస్తూ ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యేందుకు నాలుగు వారాలు పడుతుందని, ఇప్పటికిప్పుడు నియామక ఉత్తర్వులు జారీ చేయట్లేదన్నారు. పూర్తి వివరాల సమర్పణకు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి స్పం దిస్తూ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. దీంతో వారంపాటు తాము నియామకపు ఉత్తర్వులు జారీ చేయబోమని హామీ ఇస్తామని ఎస్‌జీపీ తెలిపారు. అనంతరం ధర్మాసనం ఆయన చెప్పిన దాన్ని రికార్డ్ చేసుకుంటూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.