ముఖ్యమంత్రిపై కానిస్టేబుల్ పరువునష్టం దావా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను పరుష పదజాలంతో దూషించారంటూ ఓ కానిస్టేబుల్ దాఖలుచేసిన పరువునష్టం దావాను విచారిచేందుకు కోర్టు అంగీకరించింది. దక్షిణ ఢిల్లీలోని గోవింద్పురి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే హర్వీందర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబర్ 10వ తేదీకి పోస్ట్ చేసింది. ఆరోజు ఫిర్యాది తరఫు సాక్షులను విచారిస్తారు. గోవింద్పురి స్టేషన్ హౌస్ ఆఫీసర్తో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను 'తుల్లా' అనే పదం వాడటం వల్ల తాము ప్రజలతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల దృష్టిలో బాగా చులకన అయిపోయామని హర్వీందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్.ఎన్. రావు అనే న్యాయవాది ద్వారా కోర్టులో ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన నేరాలు ఐపీసీ సెక్షన్లు 500, 504 కిందకు వస్తాయన్నారు.