'ఆమె రాకుంటే అరెస్ట్ చేసి తీసుకొస్తారు'
ముంబై: వివాదస్పద మహిళా ఆధ్మాత్మిక గురువు రాధే మాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. ఈనెల 14న కండ్లివి పోలీసు స్టేషన్ లో హాజరు కావాలని అంతకుముందు న్యాయస్థానం ఆదేశించింది.
ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో శుక్రవారం ఆమె తప్పనిసరిగా పోలీసు స్టేషన్ లో హాజరుకావాల్సి ఉంటుందని ఫిర్యాది తరపు న్యాయవాది కేఆర్ మెహతా తెలిపారు. ఒకవేళ ఆమె రాకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశముందన్నారు. రాధే మా పరారీలో ఉన్నారన్నదే తమ అభ్యంతరమని, పోలీసు స్టేషన్ కు రాకుండా ఉండేందుకు ఆమె ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు.
తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలపై ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేయడంతో ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.