‘క్రిస్పర్‌ క్యాస్‌–9’తో డిజైనర్‌ బేబీలు? | Creation of the genes with this Technology | Sakshi
Sakshi News home page

‘క్రిస్పర్‌ క్యాస్‌–9’తో డిజైనర్‌ బేబీలు?

Published Sat, Jan 7 2017 3:09 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

‘క్రిస్పర్‌ క్యాస్‌–9’తో డిజైనర్‌ బేబీలు? - Sakshi

‘క్రిస్పర్‌ క్యాస్‌–9’తో డిజైనర్‌ బేబీలు?

ఈ టెక్నాలజీతో నచ్చిన లక్షణాలతో జన్యువుల సృష్టి
ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు
సరికొత్త విధానానికి ముసాయిదా సిద్ధం చేస్తున్న కేంద్రం
కేంద్ర బయోటెక్నాలజీ విభాగం సలహాదారు ఎస్‌ఆర్‌ రావు


తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  దేశ వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమైంది. జీవకణాల్లోని జన్యువులను మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోగల క్రిస్పర్‌ క్యాస్‌–9 టెక్నాలజీకి సంబంధించి కేంద్రం ముసాయిదా విధానాన్ని సిద్ధం చేస్తోంది. బయోటెక్నాలజీ విభాగం రూపొందిస్తున్న ఈ విధానం అమల్లోకి వస్తే జన్యు మార్పిడి పంటల విషయంలో ఎదురవుతున్న అనేక సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. తిరుపతిలో జరుగుతున్న భారత సైన్స్‌ కాంగ్రెస్‌లో జన్యు ఎడిటింగ్‌ టెక్నాలజీలపై జరిగిన సమావేశంలో బయోటెక్నాలజీ విభాగం సలహాదారు డా.ఎస్‌ఆర్‌ రావు ఈ విషయాలను వివరించారు.

ఉత్పత్తులపై మాత్రమే నియంత్రణ...
‘‘క్రిస్పర్‌ క్యాస్‌–9 టెక్నాలజీలో ఇతర జీవుల నుంచి సేకరించిన జన్యువులను ఉప యోగించరు. ఉన్న వాటికే మార్పులు చేర్పులు చేస్తారు. బయో టెక్నాలజీ విభాగం రూపొందిస్తున్న సరికొత్త ముసాయిదా విధానంలో అర్జెంటీనా వంటి దేశాల మాదిరి గా జన్యు ఎడిటింగ్‌ ఫలితంగా తయారయ్యే ఉత్పత్తులపైనే నియంత్రణ ఉంటుంది. ఇందుకు ఉపయోగించిన టెక్నాలజీపై నియంత్రణ ఉండదు’’ అని ఎస్‌ఆర్‌ రావు తెలిపారు. క్రిస్పర్‌క్యాస్‌–9 టెక్నాలజీని సమర్థంగా వాడుకునేందుకు పంటలు, జీవజాతుల జన్యుక్రమాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ముఖ్యమని, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని వివరించారు.

కృత్రిమ జీవం అభివృద్ధిని పరిశీలిస్తున్నాం...
నచ్చిన లక్షణాలు ఉన్న జన్యువులను కృత్రిమంగా తయారు చేయగలగడం సాంకేతి కంగా సాధ్యమేనని, ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. మానవ జన్యుక్రమ నమోదు తరువాత కృత్రిమ జీవం అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగిందని ఎస్‌ఆర్‌ రావు తెలిపారు. ఈ రంగంలో ప్రాథమిక స్థాయి పరిశోధనలు చేపట్టాయని వివరించారు. క్రిస్పర్‌ క్యాస్‌–9 వంటి జన్యు ఎడిటింగ్‌ టెక్నాలజీలతోపాటు అనేక ఇతర శాస్త్ర రంగాల భాగస్వామ్యంతో మాత్రమే కృత్రిమ జీవాలు, జన్యువులను అభివృద్ధి చేయడం వీలవుతుందన్నారు.

డిజైనర్‌ బేబీలు దూరాలోచన!
‘‘క్రిస్పర్‌ క్యాస్‌–9తో డిజైనర్‌ బేబీలను పుట్టించడం సాంకేతికంగా సాధ్యమే అయినా అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. మరిన్ని పరిశోధనలు జరగాలి. పైగా డిజైనర్‌ బేబీలను అభివృద్ధి చేయడంపై ఎన్నో నైతిక ప్రశ్నలు ఎదురవుతాయి’’ అని మదురై కామరాజ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.వేలుతంబి చెప్పారు. అయితే భవిష్యత్తులో మానవ అవయవాలను పందుల్లో పెంచి ఉపయోగించుకునేందుకు క్రిస్పర్‌ క్యాస్‌–9 పనికొస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కురుకూటి శ్రీనివాసులు చెప్పారు.

ఏమిటీ క్రిస్పర్‌ క్యాస్‌–9?
కణ కేంద్రకాల్లో ఉండే జన్యుక్రమం గురించి మీరు వినే ఉంటారు. మన ఒడ్డూ పొడుగుల నుంచి రాగల వ్యాధుల వరకూ అన్ని రకాల జీవక్రియలకు సంబంధించిన సమాచారం ఈ జన్యుక్రమంలో ఉంటుంది. జన్యుక్రమంలో ఉండే జన్యువుల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా సమస్యలను అధిగమించేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఐదారేళ్ల క్రితం అతిసులువుగా జన్యుమార్పులు చేసేందుకు, అనవసరమైన వాటిని తొలగించేందుకు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుగా క్రిస్పర్‌ క్యాస్‌ –9 టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జన్యుక్రమంలో అక్కడక్కడా ఒకేతీరున ఉండే భాగాలు, బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో ఉండే ఒక ఎంజైమ్‌ ద్వారా ఇది సాధ్యమవుతుంది. జన్యు ఎడిటింగ్‌ కోసం ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటితో కచ్చితమైన ఫలితాలు సాధించడం కొంచెం కష్టం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement