
సైబర్ క్రిమినల్స్ కన్ను వారిపైనే..
► సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో ప్రలోభాలు
►నగరంలో పెరిగిన కేసులు
►తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరం
బెంగళూరు: ఇంటర్నెట్, సోషల్ నెట్‌వర్క్ వల్ల కలిగే అనర్థాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. బాలలకు సోషల్ నెట్‌వర్క్ వాడకంపై ఎన్నో ప్రశ్నలకు తెరతీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన నేటిరోజుల్లో పీజీ నుంచి కేజీ వరకు విద్యార్థులు ఎక్కువసేపు వాటితోనే గడుపుతోంది. అనుక్షణం వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, హైక్ వంటివాటిని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతుంటారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్నది కాదనలేని నిజం.
అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనేక మంది కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఏది తప్పో ఒప్పో తెలియని స్కూల్ పిల్లలు సులభంగా నెట్ నేరగాళ్లకు ఎరవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువవడం, పాఠశాలల్లో టెక్నాలజీ వాడకాన్ని గురించి తప్ప తద్వారా ఎదురయ్యే కష్ట నష్టాల గురించి పిల్లలకు చెప్పకపోవడమే దీనికంతటికీ కారణమని నిపుణులు చెబుతున్నారు.
కన్నవారి పర్యవేక్షణ ఏదీ?
ప్రస్తుతం నగరాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులుగా ఉంటున్నారు. వారి పని ఒత్తిడి వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారని నగరానికి చెందిన మానసిక నిపుణురాలు నైనా అన్నారు. ఈ కారణంగానే పాఠశాలల్లో చదివే చిన్నారులు సైతం ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని నైనా చెప్పారు. పిల్లల ప్రవర్తనలో కనుక మార్పు కనిపిస్తే అందుకు సంబంధించిన కారణాలేంటి అనే అంశాలపై తప్పక దృష్టి సారించాల్సి ఉంటుందని ఆమె సూచిస్తున్నారు. నెట్ వల్ల నష్టాలను వారికి వివరించడం ద్వారా వారిని సరైన దారిలో నడిపేందుకు వీలవుతుందని చెప్పారు.
సైబర్ ఎడ్యుకేషన్ తప్పనిసరి కావాలి
అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ గురించి మాత్రమే కాక, దాని ప్రమాదాలను కూడా పిల్లలకు పాఠశాలల్లో నేర్పాలని సైబర్ వ్యవహారాల నిపుణులు షమీమ్ తాబీ చెబుతున్నారు. సైబర్ భద్రతపై పిల్లల్లో, విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. ‘18 ఏళ్ల వరకు పిల్లలు చాలా సున్నితమైన మనసుతో ఉంటారు. ఆ వయసులో వాళ్లు సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకపోవడమే ఎంతో మంచిది’ అన్నారు.