ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
సాక్షి, చెన్నై: ఔను.. దీప, మాధవన్‌లు మళ్లీ ఒక్కటయ్యారు. అభిప్రాయ భేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ దంపతులు మళ్లీ ఒక్కటి కావడం దీపజయకుమార్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు వెన్నుపోటు పొడిచే యత్నం చేసిన మిత్రుడు రాజాను దీప ఇంటి నుంచి సాగనంపినట్టు పేరవై వర్గాలు తెలిపాయి.
ఆస్తులకే కాదు, రాజకీయంగానూ జయలలితకు తానే వారసురాలినని ఆమె మేనకోడలు దీప చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మొదట రాజకీయంగా ఎదుగుదలకు భర్త మాధవన్ వెన్నంటి ఉంటూ వచ్చిన దీప.. ఇటీవల 'ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై' పేరిట సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీపకు వ్యతిరేకంగా మరో పేరవై (ఫ్రంట్)ను ఏర్పాటుచేసి కేడర్‌ను చీల్చేందుకు మాధవన్ తీవ్రంగానే ప్రయత్నించారు.
మాధవన్ బయటకు వెళ్లడంతో పేరవై వ్యవహారాల్లో మిత్రుడు రాజాకు దీప పూర్తిస్థాయిలో స్వేచ్చ ఇచ్చారు. పదవుల పంపకం, నియామకాల విషయంలో రాజా చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వచ్చినా.. తొలుత దీప పట్టించుకోలేదు. తొలినాళ్లల్లో వెలుగులీనిన దీప శిబిరం ప్రస్తుతం అడ్రస్సు గల్లంతయ్యే స్థితికి చేరుకుంది. మిత్రుడు రాజా వెన్నంటి ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నాడని, ‘పేరవై’ ను దెబ్బతీస్తున్నాడని గమనించిన దీప.. ఎట్టకేలకు రాజాను టీ నగర్‌లోని నివాసం నుంచి సాగనంపారు. భర్త మాధవన్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. పేరవై వ్యవహారాల మీద దృష్టి పెట్టి మళ్లీ బలోపేతం వైపు దీప అడుగులు వేస్తున్నారు. ఆరు నెలల తర్వాత శుక్రవారం రాత్రి టీనగర్‌లోని దీప ఇంటికి వచ్చిన మాధవన్‌ను చూసిన పేరవై వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. జయలలిత సమాధి వద్దకు భర్త మాధవన్‌తో కలిసి అర్థరాత్రి వచ్చిన దీప నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు వేరు, కుటుంబం వేరు అని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే పరిణామాలను గుర్తుచేస్తూ మళ్లీ రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని, అన్నాడీఎంకేకు ఏదో రోజు తానే పెద్దదిక్కుగా నిలబడడం ఖాయమని అన్నారు.