
సోయి మరిచి కంప్యూటర్‌లో సినిమా చూస్తూ!
తాను పనిచేస్తున్నది ప్రభుత్వ కార్యాలయంలో అని మరిచిపోయి.. చుట్టు ఏం జరుగుతుందన్న సోయి కూడా లేకుండా కంప్యూటర్‌లో హాయిగా సినిమా చూస్తూ గడిపిన ఓ ఉద్యోగికి దిమ్మదిరిగే షాక్ తగిలింది.
న్యూఢిల్లీ: తాను పనిచేస్తున్నది ప్రభుత్వ కార్యాలయంలో అని మరిచిపోయి.. చుట్టు ఏం జరుగుతుందన్న సోయి కూడా లేకుండా కంప్యూటర్‌లో హాయిగా సినిమా చూస్తూ గడిపిన ఓ ఉద్యోగికి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఓవైపు రోగులు బయట వేచిచూస్తూ నానా అవస్థలు పడుతున్నా.. అదేమీ పట్టనట్టు కంప్యూటర్ తెరపై వస్తున్న సినిమాలో మునిగిపోయాడు ఆ ప్రబుద్ధుడు. ఏకంగా డిప్యూటీ సీఎం తనిఖీలు వచ్చినా ఆయనకు ఆ విషయం తెలియలేదు.
డిప్యూటీ సీఎం నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లి భుజం తట్టాడు. అప్పుడుగానీ ఆయన సినిమాలోకంలోంచి ఈ లోకంలోకి రాలేదు. ఇలా ఆకస్మిక తనిఖీ ద్వారా ఓ ప్రభుత్వ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఉద్యోగంలో తీసేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. కంప్యూటర్ లో సినిమా చూస్తున్న ఉద్యోగిని ప్రత్యక్షంగా పట్టుకున్న సంఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సిసోడియా 'ఇక్కడ ఇన్‌చార్జి ఎవరు? సినిమాలు చూడటానికి ఇక్కడికి వచ్చావా? ఆఫీసులో కంప్యూటర్లు సినిమాలు చూసేందుకు పెట్టారనుకున్నావా? సినిమాలు చూడాలని ఉంటే ఇంటికెళ్లి చూస్కో' అంటూ ఘటుగా వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆ ఉద్యోగిని కొలువులో నుంచి తీసేశారు.