
షీలాపై చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై చర్యలకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు నడుం బిగించింది. ఒకవైపు కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతునిస్తున్నా, మరోవైపు షీలాపై చర్యల దిశగా అడుగులు వేయడం గమనార్హం. ఢిల్లీలోని అనధికారిక కాలనీలకు తాత్కాలిక క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లను మంజూరు చేయడంలో షీలా అవినీతికి పాల్పడ్డారంటూ ఆమెపై చర్యలకు సిఫారసు చేస్తూ లోకాయుక్త జారీచేసిన ఆదేశాల ఆధారంగా ‘ఆప్’ ప్రభుత్వం సోమవారం రాష్ట్రపతికి లేఖ రాసింది.
లోకాయుక్త ఆదేశాల ఆధారంగా దోషులుగా తేలిన వారిపై చర్యలకు తాము రాష్ట్రపతికి సిఫారసు చేశామని ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. ఢిల్లీలో 2008 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనధికారిక కాలనీలకు దాదాపు 1200 తాత్కాలిక క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లను అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ చర్యకు పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చిన లోకాయుక్త జస్టిస్ మన్మోహన్ సరిన్, ఆమెపై చర్యలకు ఆయన రాష్ట్రపతికి సిఫారసు చేశారు.
కూలదోసేందుకు మోడీ, జైట్లీ యత్నాలు...
కేజ్రీవాల్ సర్కారును కూలదోసేందుకు బీజేపీ నేతలు నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీలు ప్రయత్నిస్తున్నారని ‘ఆప్’ ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆరోపించారు. ఇటీవల తనను ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారని, వారిలో మోడీకి సన్నిహితుడిగా చెప్పుకున్న సంజయ్ సింగ్ అనే వ్యక్తి, పార్టీని చీల్చితే రూ.20 కోట్లు ఇచ్చి, సీఎంను చేస్తానని తనకు ఎరవేశారని చెప్పారు. ‘పదిమంది ఎమ్మెల్యేలను బయటకు రప్పిస్తే, నన్ను సీఎంను చేసి, నా కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు చెల్లిస్తానని ఆశపెట్టాడు’ అని ఆరోపించారు. అలాగే, గత డిసెంబర్ 7న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి, జైట్లీ తనను కలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలనూ బయటపెట్టలేదు.