
స్కాన్‌డిడ్‌లో వాటా కొన్న మైక్రోమ్యాక్స్
మొబైల్ ఫోన్ల దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ కంపెనీ స్కాన్‌డిడ్(సేవింగ్స్ డిస్కవరీ ప్లాట్‌ఫారమ్)లో కొంత వాటా కొనుగోలు
డిస్కౌంట్లు, ధరలను పోల్చే సమాచారమందిస్తున్న స్కాన్‌డిడ్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ కంపెనీ స్కాన్‌డిడ్(సేవింగ్స్ డిస్కవరీ ప్లాట్‌ఫారమ్)లో కొంత వాటా కొనుగోలు చేసింది. వాటా కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. స్కాన్‌డిడ్ సంస్థ పుణే కేంద్రంగా 2012 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక రిటైలర్లు, ఈ కామర్స్ సంస్థల్లో వస్తువుల ధరలను పోల్చి చూపడమే కాకుండా, ఎక్కడెక్కడ ఏమేమి డిస్కౌంట్లు లభిస్తాయో.. ఆ సమాచారాన్ని స్కాన్‌డిడ్ వినియోగదారులకు అందిస్తోంది.
200కు పైగా ఆన్‌లైన్ వ్యాపారస్తులకు సంబంధించి కోటికి పైగా ఉత్పత్తుల ధరలను పోల్చే సమాచారాన్ని వినియోగదారులకు అందిస్తోంది. స్కాన్‌డిడ్ వాటా కొనుగోలు... అప్లికేషన్ సర్వీసుల రంగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని, సమగ్రమైన మొబైల్ ఇకోసిస్టమ్ నిర్మాణానికి దోహదపడుతుందని మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాహుల్ శర్మ చెప్పారు.