
అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన అసాధ్యం: వి. లక్ష్మణరెడ్డి
విజయవాడ, న్యూస్‌లైన్ : అసెంబ్లీ తీర్మానం లేకుండా దేశంలో ఏ ఒక్క రాష్ర్టం ఏర్పాటు కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి. లక్ష్మణరెడ్డి చెప్పారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన వేదిక కృష్ణా జిల్లా శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఏర్పడిన ఏ రాష్ట్రాన్ని పరిశీలించినా మాతృరాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించాకే విభజన జరిగిందన్న వాస్తవాన్ని యూపీఏ పెద్దలు గుర్తించాలని హితవు పలికారు. చివరికి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 విభజన ప్రక్రియ ఎలా ఉండాలనే విషయాన్ని మాత్రమే స్పష్టం చేసిందని, రాష్ట్రాల విభజనకు ప్రాతిపదిక ఏమిటనేది నిర్థారించడంలేదని చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, వెనుకబడిన ప్రాంతాలు ప్యాకేజీలు ప్రకటించాలని శ్రీకృష్ణ కమిటీ సూచించినప్పటికీ ఆ దిశగా కేంద్రం అడుగులు వేయలేదన్నారు. 1956-2010 మధ్యకాలంలో అత్యంత వేగంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని కమిటీ నివేదికలో పేర్కొందని తెలిపారు. శాస్త్రీయపద్ధతిలో రూపొందించిన ఈ కమిటీ నివేదికపై చట్ట సభల్లో చర్చకు రాకుండానే బుట్ట దాఖలైందన్నారు. కేవలం టీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌లో విలీనం కావడమే విభజనకు ప్రాతిపదిక అన్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్లమెంట్‌లో బీజేపీ ఓటు వేస్తే అది రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రాష్ర్ట విభజనను ఎంఐఎం, సీపీఎం, వైఎస్సార్ సీపీ బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయని, మిగిలిన పార్టీలు విభేదాలు పక్కనబెట్టి అదేబాటలో నడవాలని సూచించారు.