టీ బిల్లు పెట్టొద్దు
* లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
* సమైక్య నినాదాలతో దద్దరిల్లిన ఉభయసభలు
* సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాల హోరు
* అరగంటే సాగి నేటికి లోక్‌సభ వాయిదా
* అసెంబ్లీ తిప్పి పంపిన బిల్లును తిరస్కరించాలి
* లోక్‌సభ వెల్‌లోకి వెళ్లిన జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డి
* వారిని అనుసరించిన టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి చేరిన విభజన అంశంపై బుధవారం ఉభయసభలూ దద్దరిల్లాయి. సమైక్య, తెలంగాణ నినాదాలతో హోరెత్తాయి. దాంతో లోక్‌సభ అరగంట మాత్రమే నడిచింది. 15వ లోక్‌సభలో చివరివైన ఈ సమావేశాలు వాయిదాతో మొదలయ్యాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిప్పి పంపిన దృష్ట్యా ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ మేరకు పార్టీ ఎంపీలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవెరైడ్డిలు సభ ప్రారంభానికి గంట ముందే స్పీకర్‌కు తీర్మానాన్ని అందించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సభ సజావుగా జరగని కారణంగా తీర్మానం చర్చకు రాలేదు. విభజన బిల్లును నిరసిస్తూ వైఎస్ జగన్, మేకపాటి, ఎస్పీవై బుధవారం సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
రెండుమార్లు వెల్‌లోకి జగన్, ఎంపీలు
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన నలుగురు మాజీ ఎంపీలకు సంతాప తీర్మానాన్ని స్పీకర్ ప్రవేశపెట్టారు. తర్వాత ప్రశ్నోత్తరాలు మొదలవగానే విభజన బిల్లును వ్యతిరేకిస్తూ జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదాలతో కార్యక్రమాలను అడ్డుకున్నారు. సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ సూచించినా వెనక్కు తగ్గలేదు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు కూడా జగన్‌ను అనుసరించారు. కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బం హరి, టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.
కొందరు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీ సభ్యుడు రమేశ్ రాథోడ్ పోడియం ముందుకు వచ్చి తెలంగాణ అనుకూల నినాదాలు చేశారు. ఇవి చివరి సమావేశాలని, దయచేసి సహకరించాలని స్పీకర్ వేడుకున్నా లాభం లేకపోవడంతో సభను 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమవగానే జగన్ సహా మిగతా సభ్యులు తిరిగి వెల్‌లోకి వెళ్లి ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. అంతకుముందు అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి నిడో తానియా హత్యోదంతంపై సభ కాసేపు చర్చించింది.
రాజ్యసభలోనూ అదే సీను
బుధవారం రాజ్యసభలోనూ సమైక్య నినాదాలు మిన్నంటాయి. తొలుత మాజీ సభ్యులు ముల్కా గోవిందరెడ్డి, ఎం.ఎం.హషీం, మన్మోహన్ మాథుర్ మరణంపై చైర్మన్ హమీద్ అన్సారీ సంతాప తీర్మానం చదివి వినిపించారు. ఆ వెంటనే సమైక్య నినాదాలతో సీమాంధ్ర ఎంపీలు పోడియం వద్దకు దూసుకురావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్‌లోకి రావద్దని హెచ్చరించారు. లాభం లేకపోవడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనా సీమాంధ్ర ఎంపీల నిరసన కొనసాగింది. రాష్ట్రాన్ని విభజించవద్దని, ఆంధ్రప్రదేశ్‌ను పరిరక్షించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో సభ మరోసారి వాయిదా పడింది. 12.21కి తిరిగి సమావేశం కాగానే కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మతహింస నిరోధక బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
‘కనీసం నేను మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ సమయంలో బిల్లెలా ప్రవేశపెడతారు?’ అని ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందంలో సోనియాగాంధీ పేరు ప్రస్తావనకు రావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ) పట్టుబట్టారు. దానిపై బదులిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గందరగోళం పెరగడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ప్రారంభమయ్యాక కాసేపు మత హింస బిల్లుపై చర్చ జరిగింది. బిల్లును పెండింగ్‌లో పెడుతున్నట్టు సభాపతి పేర్కొన్నారు. అనంతరం సభ గురువారానికి వాయిదాపడింది.
ఏ బిల్లునూ ఆమోదించనివ్వం: టీడీపీ ఎంపీలు
రాష్ట్ర విభజన బిల్లుతో తలెత్తిన సమస్యను పరిష్కరించే వరకు ఏ బిల్లునూ ఆమోదించనివ్వమని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు స్పష్టంచేశారు. పార్లమెంటు వెలుపల బుధవారం సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నారాయణరావు, నిమ్మల కిష్టప్ప మాట్లాడారు. అసెంబ్లీ ఆమోదం లేకుండా ఏ రాష్ట్ర విభజనా జరగలేదని గుర్తుచేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై పునఃపరిశీలించి బిల్లును మళ్లీ అసెంబ్లీకి పంపాలని రాష్ట్రపతిని కోరారు. అసెంబ్లీ ఆమోదం తర్వాతే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. టీకాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పార్లమెంటులోకి అనుమతించి, సీమాంధ్ర టీడీపీ నేతలకు నిరాకరించడం శోచనీయమన్నారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
గద్దర్ వేషధారణలో శివప్రసాద్...
చేతిలో కర్ర.. భుజాన గొంగలితో.. సీమాంధ్ర టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ప్రజాకవి గద్దర్ వేషదారణలో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనంతరం విజయ్‌చౌక్ వద్ద గద్దర్ గేయానికి శివప్రసాద్ పేరడి పాట పాడి అలరించారు ‘గోల్కొండ మనదిరా.. ఏడు కొండలు మనవిరా.., అన్నవరం మనదిరా .. అక్షర బాసర మనదిరా... సీమాంధ్ర, తెలంగాణ వేర్వేరు కాదు.., ఈ సోనియా ఏందిరో.. ఆమె జులుం ఏందిరో...’ అంటూ గేయాన్ని ఆలపించారు.
రాజ్యసభ పక్ష నేతలతో జగన్ భేటీలు
లోక్‌సభ వాయిదా పడ్డాక వైఎస్ జగన్, మేకపాటి, ఎస్పీవై, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి బృందం రాజ్యసభలో వివిధ పక్షాల నేతలు అరుణ్‌జైట్లీ (బీజేపీ), సంజయ్ రావత్ (శివసేన), డిరిక్ (తృణమూల్ కాంగ్రెస్) లతో విడివిడి గా భేటీ అయ్యారు. విభజన బిల్లును 10వ తేదీన రాజ్యసభలో పెడతారన్న వార్తల నేపథ్యంలో, దాన్ని అడ్డుకోవాలని విన్నవించారు. బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వారికి గుర్తుచేశారు.