సుస్థిర ప్రభుతకే పట్టం
* ప్రజలకు రాష్ట్రపతి పిలుపు
* జాతినుద్దేశించి పంద్రాగస్టు ప్రసంగం
* యుద్ధ క్షేత్రాల్లా శాసన వ్యవస్థలు
* పార్లమెంటులో ప్రతిష్టంభనపై ఆందోళన
* పాక్ కవ్వింపు చర్యలపై హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు, ప్రభుత్వ పాలనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు 2014 సార్వత్రిక ఎన్నికలు ఓ అవకాశమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. భద్రత, ఆర్థికాభివృద్ధి అందించే ప్రభుత్వానికే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 67వ స్వాతంత్య్ర దినం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రణబ్ బుధవారం ప్రసంగించారు. పార్లమెంటు ప్రతిష్టంభన, అవినీతి, ఆర్థిక సంస్కరణలు, శాసన-కార్యనిర్వాహక-న్యాయ వ్యవస్థల మధ్య సమతుల్యత, పాక్ కవ్వింపు చర్యలు తదితరాలను సృ్పశిస్తూ సాగిన రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ప్రతి ఎన్నికా మైలురాయి కావాలి : సామాజిక సామరస్యం, శాంతి, సౌభాగ్యాల సాధన దిశగా దేశం అడుగులు వేసేందుకు ప్రతి ఎన్నికా కీలక మైలురాయి కావాలి. మరో స్వర్ణయుగం నిర్మించుకునేందుకు ప్రజాస్వామ్యం మన దేశానికి చక్కటి అవకాశమిచ్చింది. దీన్ని చేజార్చుకోకూడదు. ప్రజాస్వామ్యమంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడమే కాదు. నేతల బాధ్యతలను, పౌరుల విధులను దాని స్ఫూర్తి ప్రభావితం చేయాలి. నా అభిప్రాయాలను ప్రజలపై రుద్దాలని భావించడం లేదు. నాకు సరైనదనిపించిన దాన్నే మీ ముందుంచా. ఇందులో ఏది సరైనదో మీ అంతరాత్మ తేల్చుకోవాలి. (భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ) మీ నిర్ణయాలపైనే ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది.
పాలన, వ్యవస్థల పనితీరుపై ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పాలనపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి. మన శాసన వ్యవస్థలు యుద్ధ క్షేత్రాలనే తలపిస్తున్నాయి. అవినీతి అతిపెద్ద సవాలుగా మారింది. దేశ వనరులు సోమరితనం, ఉదాసీనత వల్ల వృథా అవుతున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు రాజ్యంగం కల్పించిన సమానాధికారాలను సజావుగా కొనసాగించాల్సిన అవసరముంది.
పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సరిహద్దులో ఉద్రిక్తతలు, నియంత్రణ రేఖ వెంబడి పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలు ప్రాణ నష్టానికి దారితీశాయి. శాంతి కాముకులమే అయినా మన సహనానికి కూడా హద్దుంటుంది. దేశ భద్రత, భౌగోళిక సమగ్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటాం. దేశ భద్రతను కాపాడే క్రమంలో అసువులు బాసిన జవాన్లకు నా నివాళులు.
ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం...
దేశానికి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం అవసరం చాలా ఉంది. తక్షశిల, నలంద, విక్రమశిల, వల్లభి, సోమపుర, ఉద్ధంతపురి వంటి భారత పురాతన విశ్వవిద్యాలయాల వ్యవస్థ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి 1,800 ఏళ్ల పాటు ప్రపంచాన్ని శాసించింది. మనం తిరిగి ఆ స్థానాన్ని చేరుకోవాలి. అభివృద్ధి కోసం పర్యావరణాన్ని దెబ్బతీయకుడదు. ఇందుకు ఉత్తరాఖండ్ వరద విలయమే సంకేతం. అది మనకు మేలుకొలుపు కావాలి. వరద మృతులకు నా నివాళులు. దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను పాలనలోని అన్ని స్థాయిల్లో కొనసాగించాల్సిన అవసరముంది.