ఎన్నికలతో మతానికి ముడిపెట్టొద్దు: సుప్రీం
మతం పేరుతో ఓట్లు అడగడం న్యాయ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ గురువారం పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు గానీ, అభ్యర్ధులు గానీ, పార్టీ లేదా అభ్యర్ధి తరఫు వారు మతం పేరుతో ఓట్లు వేయమని అడగకూడదని అన్నారు. 1995లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించిన ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం హిందూ మతం పేరుతో ప్రజలను ఓట్లు వేయాలని కోరచ్చనే తీర్పును కొట్టేసింది. ఎన్నికలు లౌకికంగా జరగాలే తప్ప మతం పేరుతో వాటిని ప్రభావితం చేయకూడదని వ్యాఖ్యానించింది.
2013 డిసెంబర్ లో అమల్లోకి వచ్చిన విశాఖ గైడ్ లైన్స్ ను ఈ సందర్భంగా ఉటంకించిన అత్యున్నత న్యాయస్ధానం హిందూ మతం పేరుతో ఎన్నికల్లో ఓట్లు కోరడంపై నడుస్తున్న వివాదం 20 ఏళ్లుగా పార్లమెంటులో పెండింగ్ లోనే ఉందని, శారీరక వేధింపుల గురించి కూడా ఏళ్లుగా పార్లమెంటు స్పందించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రచారంలో రామ మందిర నిర్మాణం లాంటి సమస్యలను లేవనెత్తడం కూడా న్యాయవిరుద్ధమని చెప్పింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్123(3)కింద మతాన్ని చూపుతూ పార్టీలు, అభ్యర్ధులు, పార్టీ లేదా అభ్యర్ధుల కార్యకర్తలు ఓట్లు కోరితే వారిని ఎన్నికల బరిలో నుంచి తప్పించే అవకాశాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
లౌకికవాదంలోకి మతాన్ని తీసుకురాగాలమా? అంటూ 1994లో మతాన్ని చూపుతూ ఓటు అడగొచ్చని కోర్టులో కేసు వేసిన మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే సుందర్ లాల్ పట్వా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. మతాలకు అతీతంగా ఎన్నికల చట్టాలను తీసుకువచ్చారని చెప్పిన కోర్టు దేశంలో లౌకికవాదం ఫరిడవిల్లేలా త్వరలో తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. పట్వా జైన మతానికి చెందిన వారు కాగా ఆయన అనుచరులు ఎన్నికల ప్రచారంలో రామ మందిరాన్ని నిర్మణానికి సాయం చేస్తామని ప్రచారం చెప్పడాన్ని కోర్టు ఈ సందర్భంగా ఉదహరించింది. రాజకీయం, మతం రెండూ వేరని ప్రతివాది తరఫు లాయర్ కు చెప్పింది.