ఈవోల పదోన్నతుల వివాదం | EO's promotion Dispute | Sakshi
Sakshi News home page

ఈవోల పదోన్నతుల వివాదం

Published Fri, Nov 27 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

ఈవోల పదోన్నతుల వివాదం

ఈవోల పదోన్నతుల వివాదం

సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా గ్రేడ్-2 కార్యనిర్వహణాధికారి(ఈఓ) పోస్టుల భర్తీ వ్యవహారం ఇప్పుడు దేవాదాయశాఖలో కొత్త వివాదానికి కారణమవుతోంది. గ్రేడ్-3 ఈవోలకు పదోన్నతులు కల్పించటం ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ... దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లతో వాటిని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదమైంది. ప్రస్తుతం భర్తీ కావాల్సిన పోస్టులు దేవాదాయశాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల కోటాకు సంబంధించినవి.

ఇప్పుడు వారికి కాకుండా దేవాలయ ఉద్యోగుల(పాలకమండళ్లు నియమించినవారు)తో భర్తీ చేయనుండటమే వివాదానికి కారణం. పదోన్నతులకు సంబంధించి ఆ శాఖలోని ప్రభుత్వ, దేవాలయ ఉద్యోగుల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పరస్పర ఫిర్యాదులతో విచారణలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తూ తీసుకున్న ఈ తాజా నిర్ణయం మరింత వేడి రగిల్చింది.  

దేవాదాయశాఖలో కార్యనిర్వహణాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి గతంలోనే 262 నెంబరు జీఓ ద్వారా మార్గదర్శకాలు వెల్లడించారు.గ్రేడ్-3 ఈవోల పదోన్నతుల ద్వారా, దేవాదాయశాఖ (డిపార్ట్‌మెంట్) సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించటం ద్వారా, దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించటం ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరి వాటా పోస్టులు ఎన్నో కూడా దామాషా లెక్కలు ఖరారు చేశారు. అందులో డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులతో భర్తీ  కావాల్సిన 25 గ్రేడ్-2 ఈవో పోస్టులు అలాగే ఉండిపోయాయి.

ఆ పోస్టులు తీసుకునేందుకు కొందరు ఆసక్తి చూపకపోవటంతోనే అవి కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాటిని దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లతో భర్తీ చేసేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేశారు. డిపార్ట్‌మెంట్ కోటా పోస్టులు అయినందున వాటిని డిపార్ట్‌ంట్ ఖాతాలోనే ఉంచాలని, అందుకోసం అవసరమైతే గ్రేడ్-3 ఈవోలతో భర్తీ చేయాలని శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.  దేవాలయ ఉద్యోగులతో వాటిని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించటంతో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకాలం దేవాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్నవారు ఇప్పుడు గ్రేడ్-2 ఈవోలుగా మారి తమ కంటే పై పోస్టులు పొందడం ఎలా సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా అధికారులు దాదాపు తుది నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందారని అధికారులు చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement