రాష్ట్రపతితో గవర్నర్ భేటీ
హోం, ఆర్థిక మంత్రులతోనూ నరసింహన్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన విధింపుతో రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలను రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన వివిధ అంశాల్లో తాజా స్థితిగతులను వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న కమిటీల వివరాలను, వచ్చే మూడు నెలల్లో కార్యాచరణను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే అపాయింటెడ్ డే నుంచి 14వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేసే నాటికి సీమాంధ్రకు రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు అవసరమైన నిధులపై కూడా అంచనాలను ఆర్థిక శాఖ మంత్రికి వివరించినట్టు సమాచారం. అయితే తన పర్యటన సాధారణమైనదేనని, ఎలాంటి ప్రాధాన్యం లేదని నరసింహన్ పేర్కొన్నారు. ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన ఆయన మధ్యాహ్నం హోం మంత్రి, ఆర్థిక మంత్రితో విడివిడిగా సమావేశమయ్యారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను మర్యాదపూర్వకంగానే కలిశానని, సాధారణ పర్యటనలో భాగంగానే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలతో పాటు పలు అంశాలను కేంద్ర హోం, ఆర్థిక మంత్రులకు వివరించినట్టు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాను కోరుకుంటున్నానని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటానని వివరించారు. సీఎంగా ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నియమించిన కొందరు అధికారులను వెనక్కి పంపిన నేపథ్యంలో ఇంకా ఎవరినైనా మార్పు చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... సాధారణ బదిలీల్లో భాగంగానే అవి జరిగాయని నరసింహన్ చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చివరిలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరుపుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవమెంత? అని ప్రశ్నించగా... అవి మీకే (మీడియాకే) తెలియాలంటూ సమాధానం దాటవేశారు. బాధ్యతలు తీసుకుని రెండే రోజులైనందున మిగతా విషయాలను త్వరలోనే పరిశీలిస్తానని, వీలును బట్టి ప్రధానమంత్రితో భేటీ అవుతానని చెప్పారు.