కుటుంబంలో సంపాదించే వ్యక్తి చాలా కీలకం. సంపాదించే ఆ వ్యక్తి(పురుషుడు లేదా మహిళ) అన్ని విధాలా బాగుంటేనే ఆ కుటుంబం నిశ్చింతగా ముందుకెళ్తుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఆదాయం ఆగిపోయినా, అనారోగ్యం పాలైనా, లేదా జరగరాని సంఘటన జరిగినా ఆ కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతుంది. మనిషి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు కాని, ఆ కుటుంబ పెద్ద లేకపోయినా మిగిలిన సభ్యుల జీవనయానం, ఆర్థిక లక్ష్యాలు ఆగిపోవు కదా? ఇలాంటి సమస్యలకు బీమా అనేది చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.
ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై చిన్న కుటుంబాలు పెరుగుతున్న ఈ కాలంలో ఆర్థిక భద్రత కల్పించడానికి బీమా ఒక రక్షణాస్త్రంగా మారింది. దీనికితోడు సగటు ఆయుః ప్రమాణం కూడా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సగటు ఆయుః ప్రమాణం 67 సంవత్సరాలకు చేరింది. అంటే పదవీ విరమణ తర్వాత జీవించే కాలం పెరుగుతోంది. దీంతోపాటు వైద్య ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు వైద్య బీమా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. కాబట్టి సంపాదిస్తున్న ప్రతీ మనిషి జీవితబీమాతో పాటు, ఆరోగ్య బీమా తప్పనిసరిగా కలిగి ఉండాల్సిందే.
బీమా ఎంతుండాలి?
ప్రతి వ్యక్తీ ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలన్నది ముందుగా తెలుసుకోవాలి. ఇది ప్రతీ మనిషికి ఒకే విధంగా ఉండదు. ఎంత బీమా అవసరమన్న విషయం ఆ వ్యక్తి వయసు, ఆదాయం, అతనిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్నే హ్యూమన్ లైఫ్ వేల్యూ అంటారు. ఒక మనిషి ఇంకా సంపాదించడానికి ఉన్న సంవత్సరాలతో వార్షిక ఆదాయాన్ని గుణిస్తే వచ్చేదాన్ని హ్యూమన్ లైఫ్ వేల్యూగా పేర్కొంటారు. ఈ మొత్తానికి బీమా తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు 25 సంవత్సరాల వ్యక్తి వార్షిక ఆదాయం రూ.2 లక్షలు అనుకుందాం. అతని రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు అనుకుంటే అతను ఇంకా 35 సంవత్సరాలు (60-25=35) సంపాదిస్తాడు. దీని ప్రకారం అతని హ్యూమన్ లైఫ్ వేల్యూ రూ.70 లక్షలు (35ని రెండు లక్షలతో గుణిస్తే) అవుతుంది. ఈ విలువకు సరిపడా ఒక టర్మ్ పాలసీని తప్పకుండా తీసుకోవాలి.
ఇన్వెస్ట్‌మెంట్ సాధనం కాదు...
మనలో చాలామంది బీమాను ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చూస్తారు. ఇది సరైన విధానం కాదు. బీమా అనేది కుటుంబానికి ఆర్థిక రక్షణ ఇచ్చే సాధనంగానే పరిగణించాలి. ఈ ఆర్థిక రక్షణతోపాటు రాబడి, పన్ను ప్రయోజనాలు లభిస్తే వాటిని అదనంగానే చూడాలి కాని అవే ప్రధానంగా భావించకూడదు. అలాగే పాలసీ తీసుకునేటప్పుడే ఎంత కాలం ప్రీమియం చెల్లించాలి? ఇది మన ఆర్థిక అవసరాలను తీరుస్తుందా లేదా అన్న విషయాలను కూలంకషంగా చర్చించిన తర్వాతనే పాలసీ తీసుకోవాలి. ముందు హడావుడిగా పాలసీ తీసుకొని మధ్యలో రద్దు చేసుకుంటే కట్టిన ప్రీమియం కూడా నష్టపోవాల్సి రావచ్చు. అలాగే బీమా పాలసీలను ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత అధిక ప్రయోజనం లభిస్తుంది. వయసు పెరిగేకొద్దీ ప్రీమియం పెరగడమే దీనికి కారణం. అదే చిన్న వయసులోనే తీసుకుంటే తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ బీమా ప్రయోజనాన్ని దీర్ఘకాలం కొనసాగించవచ్చు. పాలసీ తీసుకునే ముందు ఆ కంపెనీ పనితీరును కూడా తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎలా ఉందో చూడాలి. ఎక్కువ రేషియో ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ద్వారా క్లెయిమ్ సమయంలో అంతగా సమస్యలు రావు.
బీమాతోనే ఆర్థిక రక్షణ
Published Sun, Oct 6 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement