తల్లిదండ్రులు చంపేస్తారేమోనన్న భయంతో!
గౌతం, ప్రీతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల కిందట ఇంటి నుంచి పారిపోయిన ఈ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించి.. పోలీసు స్టేషన్‌లో ఒక్కటయింది. ఆ సమయంలో గౌతంకు ఇంకా మైనారిటీ తీరలేదు. కులాలు వేరయినా వీరి పెళ్లిని ప్రీతి కుటుంబం చివరికీ సమ్మతించింది. కానీ గౌతం తల్లిదండ్రులు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. వేరే కులం పిల్లను ఎలా చేసుకుంటావని బెదిరించారు.
ప్రీతి నుంచి తనను తండ్రి వేరు చేస్తాడేమోనని గౌతం భయపడ్డాడు. తండ్రిని ఎదిరిస్తే తమ ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన చెందాడు. దీంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ చర్యను వ్యతిరేకించాల్సిందిపోయి ప్రీతి కూడా భర్తతో కలిసి తాను బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించింది. కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ఆ జంట ఈ నెల 12న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది.
ప్రస్తుతం ఈ యువజంట ఐసీయూలో చికిత్స పొందుతోంది. అయితే, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలాచ్చిలో నివాసముంటున్న గౌతం, ప్రీతి అనే నూతన జంట తల్లిదండ్రుల నుంచి పరువుహత్య ముప్పునకు భయపడి.. తామే స్వయంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కోయంబత్తూరులోనే ప్రేమించి పెళ్లిచేసుకున్న శంకర్ అనే యువకుడిని అమ్మాయి తరఫు బంధువులు పట్టపగలే నరికి చంపిన సంగతి తెలిసిందే.