కడుపులో పగ దాచుకొని 8 ఏళ్లు వేచిచూశారు!
కోయంబత్తూరు: సంతోష్, సుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లు వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోయింది. సంతోష్ సుమతిని తొలిసారి కోయంబత్తూరులో కలిశాడు. అప్పుడు ఆమె పీజీ చదువుతోంది. కొంతకాలానికి వారి స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరైనా, తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చదువుకున్న వారు కావడంతో ఎలాంటి మనస్పర్థలు లేకుండా వారి వైవాహిక జీవితం ముందుకుసాగింది. ఈ క్రమంలో సంతోష్ కు ఇటీవల బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం లభించింది. దీంతో అతను తన సొంతూరు నమ్మక్కల్ నుంచి హోసూర్ కు మకాం మార్చాడు.
త్వరలోనే భార్య సుమతిని కూడా హోసూర్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. అయితే ఇంతలోనే ఇటు నమక్కల్‍లోని తన ఇంట్లో ఘోరం జరిగింది. సుమతి గొంతుకోసి దోపిడీ దొంగలు ఇంటిలో నుంచి బంగారం, నగలు ఎత్తుకుపోయారని సంతోష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కొడుకు కులాంతర వివాహాన్ని అంగీకరించి.. సుమతిని కొడలిగా ఒప్పుకున్నట్టు అతని తల్లిదండ్రులు పైకి నటించినప్పటికీ, వారు కడుపులో పగ దాచుకొని ఎనిమిదేళ్లు వేచి చూశారని, అదను రాగానే కొడలిపై దాడిచేసి ఆమె గొంతు కోసి చంపారు.
దీనిని దోపిడీ దొంగలు కిరాతకంగా చిత్రించేందుకు ఆమె ఫోన్ ను, నగలను తామే తీసి దాచిపెట్టి.. పోలీసులకు కథలు అల్లి చెప్పారు. అయితే, పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ కేసులో మృతురాలు సుమతి అత్తమామలు పళనివేల్, మధేశ్వరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పరువు హత్య కేసు నమోదుచేసి.. సేలం జైలుకు తరలించారు.