'కారు' కథకు తెరపడింది..
ముంబయి: కండల వీరుడు సల్మాన్ ఖాన్ భవిష్యత్తు తేలిపోయింది. 13 ఏళ్ల తర్వాత సల్లూ భాయ్ కారు కథకు తెర పడింది. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నిందితుడుగా ఉన్న హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆయనను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే, శిక్ష మాత్రం ఇంక ఖరారు కాలేదు.
2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ మద్యం మత్తులో కారు నడపడం వల్ల రోడ్డు పక్కన ఉండే ఫుట్ పాత్పై పడుకున్న వారిపై వాహనం దూసుకెళ్లినట్టు కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. తొలుత బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది. అనంతరం విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో పలువురిని ప్రశ్నించి, సాక్ష్యాలు నమోదు చేశారు.
సల్మాన్పై సెక్షన్లు.. వివరాలు
- సెక్షన్ 304: పార్ట్ 2... ఉద్దేశం ఉన్నా లేకున్నా హత్య, పదేళ్ల వరకు జైలు శిక్ష
- సెక్షన్ 279: వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఆరు నెలల వరకు జైలు శిక్ష
- సెక్షన్ 337, 338: తీవ్రంగా గాయపరచడం, రెండేళ్ల వరకు జైలు శిక్ష
- సెక్షన్ 427 :ఆస్తుల ధ్వంసం, రెండేళ్ల వరకు జైలు శిక్ష
- సెక్షన్ 34(ఏ), (బీ): నిబంధనలు విరుద్ధంగా వాహనం నడపడం ఆరు నెలల జైలు శిక్ష